బచ్చన్నపేట ఆగస్టు 18 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేసిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ కోరారు. సోమవారం తహసీల్దార్ రామానుజచారికి ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేసిరెడ్డిపల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం సర్వే నంబర్లు 390,391 ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసి ఇండ్లులేని నీరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిందన్నారు.
అందులో కొంతమంది ఇండ్లు కట్టుకోగా మిగతా భూమిని కొంతమంది ఇళ్ల స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే విచారణ చేపట్టి అర్హులైన ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు బైరగోని బలరాములు, ఎడబోయిన రవీందర్ రెడ్డి, రామగళ్ల అశోక్, ఇంజ ఎల్లయ్య, రాళ్ల బండి కనకచారి, తదితరులు పాల్గొన్నారు.