Torruru | తొర్రూరు,జులై 09 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టే చెరువు కట్ట మరమ్మత్తు పనులు నిలిపివేయడంపై స్థానిక రైతులు బుధవారం కట్టపై నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చెరువు కట్ట మరమ్మత్తులకు రూ.6.95 లక్షల టెండర్ అగ్రిమెంట్ జూలై 2న పూర్తయింది. కాంట్రాక్టర్ చెక్రు నాయక్ పనులు ప్రారంభించి సుమారు 250 ట్రిప్పుల మొర్రం కట్టపై పోశారు. అయితే, గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ పార్టీలో చెలామణి అవుతూ కాంట్రాక్టర్ను బెదిరించడమే కాకుండా, పనులను అడ్డుకున్నారని రైతులు తెలిపారు.
ఈ వ్యవహారంపై పాలకుర్తి ఎమ్మెల్యే పీఏ శంకర్ అధికారులకు ఫోన్ చేసి పనులను మాకు తెలియజేయకుండా ప్రారంభించారని అభ్యంతరం తెలపడంతో అధికారుల ఆదేశాలతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేసి, “ఇప్పుడు నేను ఈ పనులు చేయను, కాంగ్రెస్ నాయకులే చేసుకోవాలి” అంటూ వెనక్కు తగ్గాడు. అభివృద్ధి పనులను మధ్యలో ఆపడం సరికాదని, వర్షాకాలంలో కట్ట మరమ్మత్తులు వాయిదా వేయడం ప్రమాదకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కురిసిన వర్షాలతో కట్ట భాగం తెగిపోవడంతో, సర్పంచ్ సూచనల మేరకు డస్ట్ కంకరతో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినా, దానికి సంబంధించిన రూ.2 లక్షల బిల్లు ఇప్పటివరకు విడుదల కాలేదని పేర్కొన్నారు.
ఈ చెరువు ఆయకట్టు సుమారు 450 ఎకరాలకు నీరు అందిస్తున్న నేపథ్యంలో ఒక్క వర్షం పడితే కట్ట పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. టెండర్ పూర్తై, అగ్రిమెంట్ అయిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే సమయంలో కాంగ్రెస్ నేతలు అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని, రాజకీయాలను పక్కన పెట్టి కట్ట మరమ్మత్తు పనులను వేగంగా పునఃప్రారంభించాలని, రైతుల జీవితాధారంగా నిలిచిన ఈ చెరువు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సోమన్న, కొమ్ము ఎల్లయ్య, యాకయ్య, మల్లేష్, వెంకన్న, సాయిలు, సోమయ్య, ప్రభాకర్, సతీష్, వెంకన్న, సోమేష్, బాబు, కమలాకర్, రాంబాబు, కుమార్, ఎల్లయ్య, వినయ్, తదితరులు పాల్గొన్నారు.