హనుమకొండ, సెప్టెంబర్ 17: కాకతీయ యూనివర్సిటీ అంబాసిడర్లు పూర్వ విద్యార్థులు.. వారే మా బలమఅని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగం గోల్డెన్ జూబ్లీ సంబురాల్లో నేపథ్యంలో వీసీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూజెర్సీలోని అట్లాంటాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజుల సంబురాల సందర్భంగా ‘సెలబ్రేట్ అండ్ కంట్రీబ్యుట్’ అనే థీంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
5 దశాబ్దాల సుదీర్ఘమైన అకాడమిక్ ప్రయాణంలో మూడు వేలమందికిపైగా బీ-ఫార్మసీ, 18 వందల మంది ఎం-ఫార్మసీ, 370 మంది పీహెచ్డీ పట్టాలు పొంది శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, నియంత్రణ సంస్థల అధికారులుగా, ఫార్మసీ బోధకులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, వీరిలో డాక్టర్ మన్సూర్ఖాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎఫ్.డి.ఎ పూర్వపు సంచాలకులుగా, డాక్టర్ మురళీకృష్ణ డి.వి, దివిస్ ల్యాబ్ వ్యవస్థా పకులుగా, టెక్సాస్, ఎ అండ్ ఎం యూనివర్సిటీ లో డాక్టర్ సాంబారెడ్డి ఉన్నారన్నారు.
వీరి పరిశోధనలో ఎన్నో విప్లవాత్మక మెడిసిన్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఫార్మసీ విభాగ విశ్రాంత ఆచార్యులు వై.మధుసూదన్‌రావు మృతికి నివాళి అర్పించారు. ప్రొఫెసర్లు సి.కే.కొకటే, మల్లారెడ్డి, అమరేశ్వర్, రామ్బహు, డి.రామకృష్ణ, ఎం.సి.ప్రభాకర సేవలను కొనియాడారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ విద్యను ప్రపంచవ్యాప్తం చేయటంలో వారి కృషిని అభినందించారు.