పాలకుర్తి,జులై 30 : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాగు, తాగు నీరులేక కరెంట్ రాక జనం అరిగోస పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో బుధవారం రైతులు నిరసనకు దిగారు. గత మూడు నెలల నుండి విద్యుత్ అంతరాయం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కరెంట్ సమస్యను సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పలుమార్లు పాలకుర్తి ఏఈ రణధీర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ సరఫరా సరిగా లేకపోవడంతో వందల ఎకరాల్లో నాట్లు ఆగిపోయాయని వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు కొలుపుల సుధాకర్, గుండు శ్రీనివాస్, చేవెళ్లి మల్లయ్య, వాసూరి అంజయ్య, చేవెళ్లి నరసయ్య, గంట రాజు, చేవెళ్లి శ్రీశైలం, పోలాస భిక్షం, తదితరులు అపాల్గొన్నారు.