ఇనుగుర్తి, జనవరి 1 : తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామమైన ఇనుగుర్తి మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. రూ. 7 కోట్లతో పాఠశాలను అభివృద్ధి చేస్తానన్నారు.
తన తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణ-వెంకటనర్సమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. కోటి, ఎంపీ నిధుల నుంచి రూ. 6 కోట్లు కేటాయించి అత్యాధునిక హంగులతో పాఠశాల భవనాన్ని ఈ ఏడాదే నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయిస్తానని, పాఠాలు బోధించేందుకు గదులను సైతం నిర్మిస్తానన్నారు. అలాగే సకల హంగులతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
గ్రామంలో శిథిలావస్థలో ఉన్న శివాలయం పునర్నిర్మాణానికి, మండలాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ డీకొండ వెంకన్న, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బేతమల్ల చంద్రయ్య, మాజీ సర్పంచ్ దార్ల రాంమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి గండు నాగన్న, మాజీ ఎంపీటీసీ పింగిలి రజిత శ్రీనివాస్, బైరు బాలయ్య తదితరులు ఉన్నారు.