గార్ల, ఏప్రిల్ 18 : కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించేందుకు చట్ట సభల్లో మాట్లాడి, పోరాటం చేస్తామన్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. 15 నెలలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు.
మరో మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. గార్లలో శాతవాహన, ఇంటర్ సిటీ, ఎక్స్‌ప్రెస్ రైళ్లు హాల్టింగ్ కల్పించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని రవిచంద్ర చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పూలమాల, శాలువాతో ఆయనను సన్మానించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎల్కతుర్తి రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు మీగడ శ్రీనివాస్, పానుగంటి రాధాకృష్ణ, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎల్కతుర్తిలో సభాస్థలిని శుక్రవారం సాయంత్రం నెక్కొండ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, సభా ఏర్పాట్లు పరిశీలించి నెక్కొండ బీఆర్ఎస్ నాయకులు చేపట్టాల్సిన పనులు, నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజల తరలింపు తదితర అంశాలపై సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచిందని, కొత్త కొత్త పథకాలకు ఇక్కడినుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు గుర్తుచేస్తూ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వెనుకబడుతున్న తీరుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట నెక్కొండ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, న్యాయవాది కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ జాటోత్ రమేశ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ లావుడ్యా సరోజ-హరికిషన్, మాజీ వైస్ ఎంపీపీ దొనికెన సారంగపాణి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు గాదె భద్రయ్య, బొల్లెబోయిన వీరస్వామి, మాజీ సర్పంచ్ బదావత్ స్వరూప-రవి, బక్కి కుమారస్వామి, మాతంగి రాజు పాల్గొన్నారు.