నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15 : యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక కౌంటర్ పెట్టారని చెప్పడంతో లైన్లో నిలబడడానికి అందరూ కౌంటర్ వద్దకు పరుగులు తీశారు. ఒక్క బస్తా కోసం ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
రేవంత్‌రెడ్డి యూరియా బస్తాలు ఇవ్వలేని అసమర్థుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వేచి చూసిన రైతులకు యూరియా దొరక్కపోవడంతో విసుగు చెంది ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వరంగల్-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. యూరియా సోమవారం వస్తుందని చెప్పడంతోనే పొద్దున వచ్చి క్యూలో నిల్చున్నామని, ఇప్పుడు లేదని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకొని యూరియా అందేలా చూస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
ఖానాపురం మండల కేంద్రంలోని నర్సంపే ట-మహబూబాబాద్ ఎన్‌హెచ్-365 జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్సై రఘుపతి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కొడకండ్ల మండలకేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం కడగుట్ట తండాకు చెందిన 75 ఏండ్ల వృద్ధుడు ధరావత్ బిచ్చ క్యూలో ఉండగా తోపులాట జరిగి రైతు లందరూ ఒక్కసారిగా ముందుకు రావడంతో అతడి తలకు స్వల్ప గాయమయ్యింది.