నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 1 : యూరియా కొరతపై రైతులు కన్నెర్ర చేశారు. మహబూబా బాద్ జిల్లా మరిపెడలో సోమవారం సుమారు 5 గంటల పాటు ధర్నా చేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో ఖమ్మం-వరంగల్ రహదారిపై వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల వాహనాలు నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా రైతులు వినలేదు. చివ రకు సీఐ రాజ్‌కూమార్ గౌడ్ ఏడీఏ విజయచందర్తో మాట్లాడి వారి పైఅధికారుల సూచన మేరకు మంగళవారం రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి అందరికీ యూరియాను పంపిణి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కేసముద్రంలో ఆదివారం రాత్రి నుంచే చిమ్మ చీకట్లోనే వర్షం పడుతున్నప్పటికీ కుటుంబసమేతంగా చంటి పిల్లలను ఎత్తుకొని మరీ నిలబడ్డారు. వేలాది మంది రావడంతో తోపులాట జరుగగా పలువురికి గాయాలయ్యాయి. రాత్రి నుంచి క్యూలో ఉంటే ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 2 గంటల పాటు తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధి కారులు 2 రోజుల్లో యూరియా అందిస్తామని తెఈపడంతో రైతులు వెళ్లిపోయారు.
కురవి మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఎకడికకడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీష్ సిబ్బందితో కలిసి రైతులనే సముదాయించారు. మహబూబాబాద్ పీఏసీఎస్‌కు సోమవారం యూరియా లారీ లోడ్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన రైతులకు రాకపోవడంతో కన్నెర్ర చేశారు. కనీసం సమాచారం ఇచ్చేందుకు సొసైటీ అధికారులు సైతం లేకపోవడంతో మానుకోట-తొర్రూరు రోడ్డుపై బైఠాయించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం, సొసైటీ చుట్టూ తిరిగి వేసారిన అన్నదాతలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
వారిని పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. నర్సంపేటలో రైతులు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లైన్లు కట్టినా యూరియా రాకపోవడంతో ధర్నా చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సీఐ మాట్లాడి యూరియా అందించేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ సొసైటీ పరిధిలోని తోపనపల్లి గ్రామంలో యూరియా బస్తాలు దొరకని రైతులు కేసముద్రం-నెక్కొండ ప్రధాన మార్గంలో ఆందోళనకు దిగారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.