నమస్తే తెలంగాణ, ఆగస్టు 28 : ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సర్కారు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గోదాము ఎదుట ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట అన్నదాతలు బారులు తీరారు. పాలకుర్తిలో యూరియా లేదని బోర్డు పెట్టడంతో ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం నుంచి రాజీవ్ చౌరస్తాకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఎస్సై దూలం పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ములుగు జిల్లా కేంద్రంలో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అయినప్పటికీ టోకెన్లు ఇవ్వకపోవడంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు. కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్, సీఎం, మంత్రి సీతక్క డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకోగా దేవగిరిపట్నం గ్రామానికి చెందిన కౌలు రైతు యాపాటి తిరుపతిరెడ్డి సరిపడా యూరియా అందించాలని ఆయన కాళ్లు మొక్కాడు.
దీంతో కలెక్టర్ అలా చేయవద్దని, తాను రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి సా యంత్రం వరకు పడిగాపులు కాశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు తెల్లవారుజాము నుంచే గంటల కొద్ది వేచి చూసినా యూరియా ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు. తొర్రూరులో యూరియా లేకపోవడంతో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై బైఠా యించారు. చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతు బీరెల్లి హరీష్ రెడ్డి బైక్‌పై తొర్రూరు పీఏసీఎస్‌కు వచ్చి వెళ్తుండగా కుక అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.