ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఆగ్రహించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల పీఏసీఎస్ వద్ద ధర్నా చేయగా, నర్సంపేటలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరిపెడలో సొసైటీ గేటు తీయకపోవడంతో మహిళా రైతులు వాటిపై నుంచి దూకి పరుగులు తీశారు. గోదాము నుంచి అందిన కాడికి బస్తాలు తెచ్చుకున్నారు. శాయంపేటలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముందు మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే ఆయన ఫోన్ చేసి యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 3
రైతులకు యూరియా అందించాలని గొల్లచర్ల పీఏసీఎస్ వద్ద రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయిం చారు. దీంతో మహబూబాబాద్ నుంచి డోర్నకల్ వైపు వచ్చే వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద కూపన్ల కోసం రైతులు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో తోపులాట జరగడంతో మహిళా రైతు గుగులోత్ సోనా తదితరులు కిందపడ్డారు. దీంతో ఆమెను పోలీసులుచికిత్స కోసం అసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కార్యాలయం షట్టర్ వేయడంతో ఊపిరాడక ఏఈవో మౌనిక సొమ్మసిల్లి పడిపోయింది.
మరిపెడ మండలానికి కూపన్లతో వేలాది మంది వచ్చారు. 666 బస్తాలకు సుమారు 2000 మంది రావడంతో యూరియా అందుతుందా.. లేదా అనే భయంతో రైతులు గోదాములోకి వెళ్లి 86 బస్తాలను తీసుకెళ్లారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైతులను అడ్డుకొని గోదాం షట్టర్ వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సై సతీశ్ సొసైటీకి చేరుకుని షట్టర్ తీసి రైతులను అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ కృష్ణ కిశోర్ సొసైటీకి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, పీఏసీఎస్ కేంద్రంలోని ఆక్రమంగా చొరబడి యూరియా బస్తాలను ఎత్తుకెళ్లిన సోమ్లా తండాకు చెందిన ఆజ్మీరా వనిత, రేఖ్యా తండాకు చెందిన బానోత్ రవి, పగిడిల నరేశ్, భూక్యా హర్బిజన్ సింగ్, గుగులోతు సుమన్, బదావత్ నాన్పులపై వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొలగాని సతీష్ తెలిపారు. నర్సంపేట పట్టణంలోని అంగడిసెంటర్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఏవో కృష్ణకుమార్, నర్సంపేట టౌన్ సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు ససేమిరా అన్నారు.
అనంతరం వారు ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా అందించేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. శాయంపేటలోని సాయిఫర్టిలైజర్లో యూరియా పంపిణీ జరుగుతుండగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న మహిళలు, రైతులు ముందుకొచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం ఆయన ఏవో గంగాజ మునకు ఫోన్ చేసి అర, ఎకరం ఉన్నోళ్లకు యూరియా ఇయ్యడం లేదట.. ఇదేందని ప్రశ్నించారు.
గ్రా మాల్‌లోకి వెళ్లి సిబ్బందితో టోకెన్ సిస్టమ్ పెట్టి యూరియా ఇవ్వాలన్నారు. రైతుల ఆయకట్టు ప్రకారం ఎవరికి ఎంత ఉంటే అంత ఇవ్వాలన్నారు. రైతులకు యూరియా అందించకపోతే పోరాటం తప్పదని గండ్ర హెచ్చరించారు. శాయంపేటలో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు మండల వ్యవసాయ అధికా రి గంగాజమున రాగా, రైతులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రోజులుగా తిరుగుతున్నా యూరియా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. దీంతో ఏవో పంపిణీ లెక్కలు చూపించేందుకు రికార్డులు తెప్పించారు.
యూరియా పేరుతో రాజకీయ డ్రామాలు
చిట్యాల, సెప్టెంబర్ 3 : యూరియా కొరతకు కారణమైన వారే ఇప్పుడు ఆ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో యూరియా కొరతపై, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చిట్యాలలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత అని అన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎప్పుడూ యూరియా కొరత లేదని, ఏనాడూ రోడ్డెకాల్సిన దుస్థితి రాలేదని తెలిపారు. మిస్ వరల్డ్ పేరిట రెండు నెలల పాలనను గాలికొదిలేసిండు తప్ప, ఎరువులు, విత్తనాల గురించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయలేదన్నారు. బాధ్యతగా ఉండాలనే సోయి కూడా లేకుండా ప్రతి వైఫల్యాన్ని బీఆర్ఎస్, కేసీఆర్‌పై వేస్తూ రంకెలేయడం తప్ప 22 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ఒరగబెట్టిందేమిటి? అని ప్రశ్నించారు.
యావత్ రైతాంగాన్ని యూరియా కోసం నడిరోడ్డుపై నిలబెట్టిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కళ్లల్లో నీరు తెప్పిస్తున్న ప్రభుత్వానికి తప్పకుండా ఉసురు తగులుతుందని అన్నారు. ప్రతిపక్షాల మీద నిందలు మాని, ఇప్పటికైనా రైతుల యూరియా కష్టాలపై దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం చిట్యాలలో ‘గణపతి బప్పామోరియా.. కావాలయ్యా యూరియా’ అంటూ వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేశ్, కేటీఆర్ సేన మండలాధ్యక్షుడు ట్రీమ్స్ తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు కాట్రేవుల కుమార్, నాయకులు పుట్టపాక మహేందర్, పెరుమాండ్ల రవీందర్, వీరస్వామి, చిలుముల రమణాచారి, ఏలేటి రాజురెడ్డి, రఘు, బానోత్తు శ్రీనివాస్, కూస ప్రశాంత్ రెడ్డి, కటుకూరి రాజేందర్, శ్రీదేవి, సరోజన తదితరులు పాల్గొన్నారు.