రోజుల తరబడి తిండీతిప్పలు మాని తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా దొరకక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎరువు ఇవ్వడం చేతగాకుంటే సర్కారు ఎవుసం మానేయమని చెప్పాలని బోరుమంటు న్నారు. రాత్రిళ్లు క్యూలో నిల్చున్నా అందకపోవడంతో ఆగ్రహం తో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశా రు. మరిపెడలో ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ను నిలదీయగా, నర్సింహులపేటలో ఆధార్, పట్టాదారు పుస్తకాల జిరాక్స్ ప్రతులను కాల్చివేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 2
వారం రోజులుగా యూరియా దొరక్కపోవడంతో రైతులు స్టేషన్ ఘన్‌పూర్‌లోని జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు నచ్చజెప్పడంతోఆందోళన విరమించారు. జఫర్‌గఢ్‌లోని పీఏసీఎస్ ఎదుట క్యూ కట్టినా రైతులందరికీ యూరియా దొరకక పోవ డంతో వర్ధన్నపేట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వీరికి సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. రైతులు ఆకలికి తాళలేక రోడ్డుపైనే తాము తెచ్చుకున్న సద్దులను తిని ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.
బయ్యారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు యూరియా రాలేదని అధికారు లు తెలపడంతో ఆగ్రహించిన రైతులు ఇల్లందు-మహబుబాబాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేశ్, ఎన్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, ఎన్డీ మాస్‌లైన్ నాయకులు జగన్న, సూర్యం రైతుల పక్షాన సంఘీభావం పలికి ధర్నాలో కూర్చొని అధికారులతో మాట్లాడారు.
అధికారుల హామీతో ఆందోళన విరమించారు. కాగా, ధర్నాలో బయ్యారానికి చెందిన రైతు ఆకుల ఎల్లయ్య ఏడుస్తూ తన అవేదనను వెల్లగక్కాడు. తాను ఎన్నో ఏండ్లుగా ఎవుసం చేస్తున్నా ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని వాపోయాడు. యూరియా కోసం చేతులు జోడించి దండం పెట్టి.. రోడ్డుపై బోర్లా పడుకొని నిరసన తెలిపాడు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి సోమవారం రాత్రి రెండు గంటలకు రైతు ఆవుల నారాయణ వచ్చి క్యూలో నిల్చోగా మంగళవారం ఉదయం ఆయనకు ఫిట్స్ రాగా ఎస్సై రాజ్‌కుమార్ కొత్తగూడ పీహెచ్‌సీకి తరలించారు.
నర్సింహులపేటలో కొందరికి మాత్రమే యూరియా ఇస్తున్నారంటూ ఏవో డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగగా, ఈ క్రమంలో మహిళా రైతును ఓ హెడ్ కానిస్టేబుల్ నెట్టి వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నర్సింహులపేటలో పది రోజులుగా తిరుగుతున్నా ఒక్క బస్తా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్, పట్టాదారు పా సు పుస్తకాల జిరాక్స్ పత్రాలు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా పడేయడంతో అసహనానికి గురై వాటికి నిప్పంటించారు.
ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో నర్సంపేట-మహబూబాబాద్ ఎన్‌హెచ్ 365 జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈసందర్భంగా వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు. యూరియా బస్తాలు అందికపోవడంతో కడుపుమండిన అన్న దాతలు రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ నిలదీత
యూరియా కొరతపై ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ను రైతులు నిలదీశారు. మరిపెడ క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో రైతులు ఎమ్మె ల్యే వాహనాన్ని అడ్డుకొని యూరియా కొరతపై ప్రశ్నించారు. నా చేతిలో ఏముంది అంతా హైకండ్ చేతిలో ఉంది. నేనేమీ చేయలేను అనడంతో రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రబెల్లికి గోడు వెల్లబోసుకున్న రైతులు
పాలకుర్తిలోని ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతుల వద్దకు వెళ్లగా వారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడి రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రెండు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా ఇవ్వకుంటే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.