నమస్తే తెలంగాణ నెట్వర్క్ : యూరియా కష్టాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. గత ఖరీఫ్‌లో బస్తా ఎరువు కోసం విక్రయ కేంద్రాల వద్ద నానా తంటాలు పడిన రైతులకు యాసంగిలోనూ అవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత అనుభవం దృష్ట్యానైనా పాలకులకు కళ్లు తెరవకపోవడంతో కర్షకులకు నరకయాతన తప్పడం లేదు. ఖరీఫ్ మాదిరిగానే ఎరువుల కోసం సొసైటీలు, విక్రయ కేంద్రాల వద్ద అవే క్యూలైన్లు.., చెప్పుల వరుసలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం యాసంగిలో మక్కజొన్న, మిర్చి పంట వేసిన రైతులకు యూరియా తప్పనిసరి కావడంతో ఎముకలు కొరికే చలిలో తెల్లవార్లు కేంద్రాల వద్దే పడిగాపులు గాస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని వేంనూరు, ఈదులపూసపల్లి, ఉత్తరతండా, రోటిబండతండా, సోమ్లాతండాకు చెందిన భూక్యా శివరామ్, కిషన్, బానోత్ బిక్కు, సేవ్యా, వెంకన్నతోపాటు పలువురు రైతులు స్థానిక ఆగ్రోస్ సెంటర్, పీఏసీఎస్ కేంద్రం వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే లైన్లో ఉన్నారు.
తీరా అధికారులు ఈ రోజు యూరియా ఇవ్వమని, రేపు రావాలంటూ నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అక్కడి నుంచి ప్రధాన రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేశారు. బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం సొసైటీ, ఆగ్రోస్ కేంద్రం, కంబాలపల్లి సొసైటీ కేంద్రాల్లో బాలాజీపేట , బాల్యతండా, వెంకట్రాంపురం, జగ్గుతండా, నారాయణపురం, కంబాలపల్లి, కొయ్యగూడెం గ్రామాల రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేశారు. మిగిలిన వారికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.
నర్సింహులపేట మండలకేంద్రంలోని పీఏసీఎస్‌కు యూరియా బస్తాలు వస్తాయని తెలుసుకున్న కొంతమంది రైతులు శనివారం రైతువేదిక వద్దకు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి నిరీక్షించారు. మరిపెడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 644 బస్తాలు రాగా, వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రెండు కేంద్రాల వద్ద పంపిణీ చేశారు. బస్తాలు దొరకని రైతులు నిరాశతో ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో పోలీసుల సహాయంతో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు.