వరంగల్, జనవరి 29 : విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీర్మానానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన బల్దియా సమావేశం నిరసనలు, నినాదాలు, బైఠాయింపులతో రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పక్షాన కార్పొరేటర్లు నగర రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపచేయాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఎజెండా అంశాలకు ముందే అమోదించాలని డిమాండ్ చేశారు. ఎజెండా అంశాల తర్వాత ఆమోదం తెలుపుతామని మేయర్ చెప్పడంతో కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పోడియంం వద్దకు దూసుకుపోయి, అక్కడే బైఠాయించి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తీర్మానం అమోదించిన తర్వాతే ఎజెండా అంశాలు కౌన్సిల్ ముందుకు తీసుకురావాలని పట్టుపట్టారు. చివరికి ఎజెండా అంశాల తర్వాత తీర్మానానికి కౌన్సిల్ ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వానికి పంపిస్తామని సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.
అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు నిధుల కేటాయింపుల్లోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ సమయంలోనే ఎన్నికల కోడ్ వచ్చిందన్న సమాచారం మేరకు సమావేశాన్ని ముగించారు. అంతకు ముందు సమావేశం మధ్యలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ప్రారంభంలోనే సంతాపం ప్రకటించాల్సిన పాలకవర్గం మేయర్ ప్రసంగం తర్వాత తీర్మానం పెట్టి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధానికి సమావేశం మధ్యలో ఆ పార్టీ పాలకవర్గం సంతాపం తెలిపి అవమానించిందని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
23 ఎజెండా అంశాలకు ఆమోదం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ముందుకు వచ్చిన 23 ఎజెండా అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. నగరంలో చేపట్టనున్న రూ. 65.80 కోట్ల అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ముఖ్యంగా నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 4,170 కోట్ల అంచనాలతో రూపొందించిన డీపీఆర్‌కు పరిపాలన అనుమతులిచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో స్వచ్ఛ ఆటోల కోనుగోళ్లు, కాశిబుగ్గ, కాజీపేట సర్కిళ్ల పరిధిలో బయో మైనింగ్ ప్రాసెస్ యూనిట్ల ఏర్పాటును ఆమోదించారు. సప్లిమెంటరీ ఎజెండాలో నిట్ నుంచి అదాలత్ వరకు ఉన్న ప్రధాన రహదారి పేరును రెడ్ క్రాస్ మార్గ్‌గా మార్చడానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించేందుకు, వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 452 మంది పారిశుధ్య కార్మికుల వేతనాన్ని రూ. 16,600కు, కార్పొరేషన్ భారీ వాహనాలు నడుపుతున్న ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, డిప్యుటేషన్‌పై డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు రూ. 20,500కు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఆమోదించారు.
ఆత్మీయ భరోసా వర్తింపజేయాలి
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ
నగర విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపచేయాలి. లక్షలాది మంది భరోసా అందక నష్టపోతున్నారు. నగర రైతు కూలీలకు భరోసా అమలు చేసే వరకు పోరాడుతాం. కాంగ్రెస్ పాలక వర్గం నగరాభివృద్ధికి చేసిందేమీ లేదు. కౌన్సిల్ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డిపై పొగడ్తలకే సరిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రొటోకాల్ పాటించకుండా అధికారులు అవమానిస్తున్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే ఊరుకోం. విపక్ష కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పోరాడుతాం.