నమస్తే తెలంగాణ నెట్వర్క్: శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లబెల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రాజాసింగ్ మూడు ట్రాక్టర్ల మక్కలు, ట్రాక్టర్ ధాన్యాన్ని శనిగరం హైవే రోడ్డుపై ఆరబోయగా, రాత్రి కురిసిన వర్షానికి మక్కలు, ధాన్యం వరద నీటిలో హైవే డ్రైనేజీలోకి కొట్టుకుపోయాయి. దీంతో బాధిత రైతు కన్నీరుపెట్టుకున్నాడు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో, కేసముద్రం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో మకలు, ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం, వేంనూరు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జనగామ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో వందలాది ధాన్యం బస్తాలు తడిసిపోగా, ఆరబోసిన కుప్పల నుంచి వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

Warangal