నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 4 : అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. దీం తో అన్నదాతలు ఆగమవుతున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షం కురవగా, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడా వాన పడింది. దీంతో కోతకు వచ్చిన వరి నేలపాలైంది. మా ర్కెట్లు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యిం ది. మక్కజొన్నలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది ఎక రాల్లో చేన్లలోనే చేతికొచ్చిన వరి పంట నేలవాలగా, కోసిన ధాన్యం కల్లాల్లోనే తడుస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, మిల్లులను అలాట్ చేయడంలో ఆలస్యం కావడంతో కాంటాలు జరగడం లేదు. దీంతో వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడి సి ముద్దవుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సుమారు రెండువేల పత్తి బస్తాలు తడిశాయి. ఆరబోసిన మక్కలు తడిసి కొట్టుకుపోవడంతో రైతులు కంటతడి పెట్టారు. కేసముద్రం, నర్సంపేట మార్కెట్లలో ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి. వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కాగా, పరకాల మండలం పోచారం గ్రామానికి చెందిన కోస మహిపాల్ రెడ్డి (49) వ్యవసాయ పనులు చేస్తుండగా ఒకసారిగా భారీ వర్షంతో పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

వరదకు కొట్టుకుపోయిన చీటకోడూరు బ్రిడ్జి
జనగామ రూరల్ : జనగామ మండలంలోని చీటకోడూరు గ్రామంలోని రిజర్వాయర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో పాటు కురుస్తున్న వానకు బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడి గ్రామాల ప్రజలు జనగామ జిల్లా కేంద్రానికి రావడానికి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి ముసివేశారు. ఈ బ్రిడ్జిని డీసీపీ రాజమహేంద్ర నాయక్, తహసీల్దార్ హుస్సేన్ పరిశీలించారు.
మొలకెత్తిన వరి కంకులు
కేసముద్రం : మొంథా తుపాన్ అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. ఏకధాటిగా కురిసిన వాన, ఈదురు గాలులకు చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. నీటిలో మునిగిపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు. కేసముద్రం మండలంలో చేతికొచ్చిన ఓ రైతు పంటపొలం భారీ వర్షాలకు నేలవాలగా నీటిలోనే వరి కంకులు మొలకెత్తాయి. మరికొంత మురిగిపోతుండడంతో రైతు బోరున విలపిస్తున్నాడు.