గీసుగొండ, అక్టోబర్ 14 : అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 420 మోసపూరిత హమీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నదన్నారు.
తెలంగాణలో పార్టీ జెండా మారింది తప్ప పాలన మారలేదని అన్నారు. రైతుబంధు పేరు మార్చారే తప్ప ఆర్థిక సాయం అందించలేక రైతులను మోసం చేసిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పి మూసీ సుందరీకరణ పేరుతో వారి ఇండ్లను కూలగొడుతున్నాడన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ఇచ్చిన హమీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. అతి తక్కువ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేయడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పథకంపై స్పష్టమైన అవగాహన లేదని విమర్శించారు. మూసీ సుందరీకణ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు దోచుకోవడానికి కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
దేశంలో బీజేపీ మరింత బలపడుతున్నదని చెప్పటానికి అనేక రాష్ర్టాల్లో పార్టీ గెలుపే నిదర్శనమన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీ మారే ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ప్రజాతీర్పును అవహేళన చేశారన్నారు.
వరంగల్ అభివృద్ధి కోసం స్మార్ట్‌సిటీ, అమృత్ పథకంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రభుత్వం భూమి సేకరించలేదన్నారు. మెగా టెక్స్ టైల్ పార్కుకు నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వమని, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర నాయకులు రావు పద్మ, కాళీప్రసాద్‌రావు, విజయ్‌చందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.