వెంకటాపూర్, అక్టోబర్ 14 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్‌ను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. యునెస్కో ఇండియా ఐకోమస్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, భారత పురావస్తు శాఖ, తెలంగాణ పర్యాటక శాఖ, ఇంటాక్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక, పర్యాటక, వారసత్వ కట్టాడాలున్న ప్రదేశాలపై 12 రోజుల పాటు (26వ తేదీ వరకు) అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని యునెస్కో 2008లో ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించనున్నారు. కొత్తగా గుర్తింపు పొందిన కట్టడాలపై ఐదేళ్ల పాటు వలంటీర్స్‌కు శిక్షణ ఇచ్చి వారి చేత ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రామప్ప కట్టడం, దాని నిర్మాణశైలి, నిర్మాణానికి వాడిన వస్తువులు, అప్పటి ఇంజినీరింగ్ టెక్నాలజీ, సంస్కృతి, కళలు, చరిత్రపై అవగాహన కల్పించనున్ననారు.
దేశ, విదేశాల్లో చరిత్ర, కళలు, పురావస్తు, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్ రంగాల్లో అవగాహన ఉన్న 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు 243 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి అందులో 40 మందిని ఎంపిక చేశారు. అలాగే వారితో పాటు యువ టూరిజం క్లబ్ నుంచి మరో 40 మందిని సెలెక్ట్ చేసి మొత్తం 80 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీశ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు. కాగా, 22 మంది నిపుణులతో శిక్షణ కార్యక్రమాలను పాలంపేటలోని రైతు వేదికలో నిర్వహించనున్నారు.