హనుమకొండ చౌరస్తా, జులై 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల నిరసన తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం ఎదుట ప్లకార్డులు చేతబూని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులను గుర్తించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టారు.
అలాగు అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు చేసిన ధర్నాలో రాహల్‌గాంధీ పాల్గొని రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మర్చారన్నారు. 18 నెలలుగా జాబ్ క్యాలెండర్ కోసం వేచిచూస్తున్నామని, ప్రస్తుతం ఉన్న జీపీవోలలో పాతవారిని తీసుకోగా మిగిలిన 7404 పోస్టులతో కొత్త డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలన్నారు. అలాగే వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పాత వీఆర్ఏ, వీఆర్వోలకు మళ్లీ అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మొత్తం 7404 పోస్టులను కొత్త నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలన్నారు. జీపీవో నోటిఫికేషన్ 3 నెలల నుంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, గ్రూప్-1 నోటిఫికేషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. టీజీపీఎస్సీ లాయర్ నిరంజన్‌రెడ్డి గుంటూరు, క్రిష్ణా జిల్లాల ప్రజలకు తెలుగు స్పష్టంగా వచ్చు, తెలంగాణ వారికి తెలుగు రాదు అని గ్రూప్-1 హైకోర్టు కేసులో జరిగిన వాదనల్లో అవహేళన చేయడం సరైంది కాదని వెంటనే గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దుచేసి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.