ములుగు రూరల్, జనవరి 26: ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకల్లో శుక్రవారం విషాదం నెలకొంది. మువ్వన్నెల జెండాను ఎగురవేసే క్రమంలో రెప్పపాటులో ఇద్దరి జీవితాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన బోడ అంజిత్‌కుమార్(36), లాడె విజయ్(25), లాడె చక్రి తోటి స్నేహితులతో కలిసి శివాలయం ఎదుట ఉన్న జెండా గద్దె వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇనుప పైపునకు జాతీయ పతాకాన్ని కట్టి గద్దెపై నిలిపేందుకు పైకి లేపగా అది 11కేవీ విద్యుత్ తీగకు తగలడంతో షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. గమనించిన తోటి మిత్రులు, కాలనీవాసులు ముగ్గురిని చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరీక్షించిన వైద్యులు అంజిత్‌కుమార్, విజయ్ అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న చక్రికి వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క ప్రభుత్వ దవాఖానకు చేరుకొని చక్రితోపాటు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఓదార్చి తక్షణ సాయంగా రూ.10వేల చొప్పున రెండు కుటుంబాలకు అందించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి అంజిత్‌కుమార్, విజయ్ కుటుంబాలకు రూ.5లక్షల చొప్పన ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా జడ్పీచైర్‌పర్సన్ బడే నాగజ్యోతి మృతుల కుటుంబాలను పరామర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.