సుబేదారి, జూన్ 8 : వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్‌ఫోర్స్, మడికొండ, ఎనుమాములు పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రూ.2 కోట్ల 11లక్షల విలువైన నకిలీ విత్తనాలు, ఏడు టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, డీసీఎం, కారు, రూ. 21 లక్షల నగదు, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన చేదాం పాండు, మంచిర్యాలకు చెందిన కొప్పుల రాజేశ్, మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన వడిచర్ల సురేందర్‌రెడ్డి, బల్లార్షాకు చెందిన ఏన్గూడే దిలీప్, మంచిర్యాలకు చెందిన బోగె సత్యం, షేక్ అమ్జద్, ఇందుర్తి వెంకటేశ్, పుట్ట రాజేశం, హైదారాబాద్‌కు చెందిన చేదాం వెంకటరమణ, మహబూబ్‌నగర్‌కు చెందిన చేదాం నాగరాజు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లకు చెందిన సుందర్‌శెట్టి ఫణీందర్, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కాల్వ శ్రీధర్, కర్నూలు జిల్లాకు చెందిన తాప్తే హనుమంతు, హైదారాబాద్‌కు చెందిన వేముల అరవింద్‌రెడ్డి రెండు ముఠాలుగా ఏర్పడి, ప్రధాన నిందితుడు దాసరి శ్రీనివాస్‌రావు, భాస్కర్‌రెడ్డితో కలిసి రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి కర్నాటక రాష్ట్రంలో శుద్ధి చేసి, బీజీ 3హెచ్‌టీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ పత్తి విత్తనాలు గడ్డిమందును తట్టుకుంటాయని నమ్మించి, వరంగల్ నగరానికి తీసుకువచ్చి, తెలంగాణ, మహారాష్ట్ర జిల్లాలకు చెందిన రైతులకు విక్రయించేవారు.
మరో ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు చేదాం పాండు గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ కో-మార్కెటింగ్ తీసుకొని, ప్రభుత్వ అనుమతులు ఉన్న రుషి, శ్రీగణేశ్ విత్తన శుద్ధి కంపెనీల్లో తయారు చేసిన విత్తనాలను విక్రయించేవారు. కాగా, పాండు మరికొందరితో ముఠా ఏర్పాటు చేసుకొని, సులభంగా డబ్బు సంపాదించాలని నకిలీ విత్తనాల విక్రయాలకు తెరలేపాడు. ముఠా సభ్యులు క్యూఆర్ కోడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, ఎంఆర్పీలతో కూడిన నర్మద కంపెనీ నకిలీ విత్తన ప్యాకెట్లను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయించాడు. పక్కా సమాచారంతో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి బుధవారం రెండు ముఠాలకు చెందిన 15మందిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. మరో ఇద్దరు నిందితులు శివారెడ్డి, భాస్కర్‌రెడ్డి పరారీలో ఉన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
రైతులు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని సీపీ రంగనాథ్ సూచించారు. విత్తనాలను డీలర్లు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, మామూనూరు ఏసీపీ కృపాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యవసాయ అధికారులు ఉషాదయాళ్, రవీందర్ సింగ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌రావు, జనార్దన్ రెడ్డి, అల్లం రాంబాబు, ఎస్ శ్రీనివాస్, వేణు, మహేందర్, ఎస్ఐలు దేవేందర్, భూక్యా చందర్, బండారి సంపత్, శరత్‌కుమార్, లవన్‌కుమార్, రాజు, శ్రీకాంత్, ఏఏవో సల్మాన్‌పాషా, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేశ్, కిరణ్, భిక్షపతి, రాజు, శ్యాం సుందర్, సురేశ్, మహబూబ్‌పాషా, కరుణాకర్, శ్రీధర్, విక్రం, సతీశ్, రమేశ్, నరేశ్, నవీన్ కుమార్, వీ శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజును సీపీ అభినందించారు.