సుబేదారి, జూలై 29 : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పత్రాలు తయారీ చేస్తూ వాహనదారులను మోసం చేస్తున్న రెండు ముఠాలను టాస్క్‌ఫోర్స్, హనుమకొండ, మిల్స్‌కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీఏ అధికారులు సంయక్తంగా పట్టుకున్నారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా నిందితుల అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
హనుమకొండకు చెందిన ఎండీ ఆసిఫ్ ఖురేషీ, వడ్లకొండ శ్రీనివాస్, వరంగల్ లేబర్ కాలనీకి చెందిన ఎండీ సాబీర్, ఎల్బీ నగర్‌కు చెందిన మణికంట ప్రభాకర్‌రెడ్డి, హనుమకొండ నయీంనగర్‌కు చెందిన గుగ్గిళ్ల చెర్రిబాబు, కాపువాడకు చెందిన కేశోజు రాజ్‌కుమార్ ఆలియాస్ డీఎల్ రాజు, గుడిబండల్‌కు చెందిన ఎండీ ఆసిఫ్, ధర్మసాగర్ మండలం కరుణాపురానికి చెందిన అంకం శ్రీనివాస్, ధర్మసాగర్‌కు చెందిన గోనెల రమేష్, హనుమకొండ సుధానగర్‌కు చెందిన ఎన్ శశివర్ధన్, ఖిలావరంగల్‌కు చెందిన నరిశెట్టి రాజేశ్, కరీమాబాద్‌కు చెందిన తండి దిలీప్‌కుమార్,
గీసుగొండ మండలం శాయంపేట హవేలీకి చెందిన మజ్జిగ ఓంప్రకాశ్, నక్కలపల్లికి చెందిన ముషిపట్ల అక్షయ్‌కుమార్‌తోపాటు పరారీలో ఉన్న లక్ష్మయ్య, సతీశ్, వేల్పుల ప్రశాంత్, దేవులపల్లి శ్రావణ్, మామిడి రాజు అలియాస్ భూపాలపల్లి రాజు ఆర్టీవో బ్రోకర్లుగా, కన్సల్టెన్సీ యజమానులుగా రెండు ముఠాలుగా ఏర్పడ్డారు. వీరిలో ప్రధాన నిందితులు ఆసిఫ్ ఖురేషీ, వడ్లకొండ శ్రీనివాస్ ఆర్టీఏ ఏజెంట్లుగా పైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలకు రిజిస్ట్రేషన్ కార్డు పేరుతో కన్సల్టెన్సీల ద్వారా బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఆన్లైన్ ద్వారా జారీచేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఫిట్నెస్ సర్టిఫికెట్లు అవసరమున్న వాహనదారులకు రెన్యువల్ పేరుతో ఒరిజినల్ బీమా పత్రంలో గడువు తేదీలు మార్చి బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసి పెద్ద మొత్తంలో డబ్బుల వసూళ్లకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్నారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి ఆరు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, థర్మల్ ప్రింటర్, 17 సెల్ఫోన్లు, చిప్, పీవీసీ కార్డులు, ప్రింటింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సలీమా తెలిపారు.