గిర్మాజీపేట, డిసెంబర్ 31 : స్టేషన్‌రోడ్డులోని ఓ గార్డెన్లో జనవరి 11,12,13వ తేదీల్లో భద్రకాళీ దేవాలయ ప్రధానార్చకుడు శేషయ్య, కేయూ విశ్రాంత ప్రొఫెసర్లు పాండు రంగారావు, హరి సనత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం రాధాకృష్ణ గార్డెన్లో ఆచార్య తిరుపతయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి జనవరి 4,5వ తేదీల్లో కమిటీలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉర్సుగుట్ట వద్ద ఎకరం స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొస్తానన్నారు.
67 ఏళ్లుగా అణిచివేయబడిన నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. 2024లో నియోజకవర్గాన్ని ఐటీ హబ్‌గా మారుస్తానని, వరంగల్ బస్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 75 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రులు శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌కు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పన తదితరులు పాల్గొన్నారు.
అలాగే అయ్యప్పస్వామిని కించపరిచిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అన్నారు. క్యాంప్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదన్నారు. అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాల ఇన్చార్జి సూపరింటెండెంట్ అనిశెట్టి శ్రీధర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మైదం రాజు, డాక్టర్ శ్వేత, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు. రాజశ్రీ గార్డెన్లో జరిగిన మున్నూరుకాపు వెల్ఫేర్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్-వాణి దంపతులు పాల్గొని కమిటీ సభ్యులను సన్మానించారు.
వైభవంగా అయ్యప్ప స్వామి రథయాత్ర..
కరీమాబాద్ : స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణు ఘోష మార్మోగింది. శనివారం కరీమాబాద్‌లోని బొమ్మలగుడి నుంచి అయ్యప్పస్వామి రథయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా అయ్యప్పస్వామి రథానికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. నృత్యాలు చేస్తూ భజనలు, కీర్తనలు ఆలపించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగారు. బొమ్మలగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్లు నాగపురి కల్పన, పల్లం రవి నాయకులు వెలిదె శివమూర్తి, నాగపురి సంజయ్‌బాబు, మేడిది మధుసూదన్, బజ్జూరి వాసు, పొగాకు సందీప్ తదితరులు పాల్గొన్నారు.