న్యూ శాయంపేట, ఏప్రిల్ 11: కాజీపేట పట్టణంలోని ఫాతిమా హైస్కూల్లో ఎసెస్సీ స్పాట్ విధులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పూర్తి రెమినేషన్ చెల్లించాలని టీఎస్ యూటిఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవీందర్ రాజు, జనగామ జిల్లా బాధ్యులు ఆకుల శ్రీనివాస్ రావు కోరారు. కాజీపేట పట్టణంలోని ఫాతిమా హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి స్పాట్ కేంద్రంలో డీఈవో వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో పదవ తరగతి మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు రావాల్సిన తొమ్మిది రోజుల డీఏలలో ఎనిమిది రోజులు మాత్రమే చెల్లించారని, మిగిలిన ఒకరోజు డీఎ ఇవ్వాలన్నారు. గత సంవత్సరం పదవ తరగతి మూల్యాంకన విధులు నిర్వహించిన కేజీబీవీ సిఆర్టిలకు రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ జనగామ జిల్లా కన్వీనర్ కే రజని, హనుమకొండ జిల్లా కార్యదర్శి సీహెచ్ లింగా రావు, డి నవీన్ కుమార్, పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.