బయ్యారం ఫిబ్రవరి 23 : గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ సాధన కోసం బుధవారం బయ్యా రం బస్టాండ్ సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు ఒక్క రోజు నిరశన దీక్ష తలపెట్టారు. ఈ దీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ బయ్యారంలో నాణ్యమైన ఇనుప ఖనిజం ఉండడం వల్లే విభజన చట్టంలో పరిశ్రమకు హామీ లభించిందన్నారు. అయితే చేతగాని దద్దమ్మ లాంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపే నేతలు బయ్యారం ఉక్కులో నాణ్యత లేదంటూ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విభజన సమయంలో ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి ఏ ఒక్క హామీనీ నెరవెర్చలేదని మండిపడ్డారు. కేంద్రంతో కొట్లాడలేని రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఉక్కు పరిశ్రమ కేంద్రం ఇచ్చే భిక్ష కాదని, తెలంగాణ ప్రజల హక్కు అని గుర్తుంచుకోవాలన్నారు. పరిశ్రమ విషయంలో కాంగ్రెస్ దొంగ దీక్షలు చేయాలని చూస్తున్నదని 70 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలను ఆ పార్టీ మోసం చేసిందన్నారు. ఆ పార్టీకి నాడు విశాఖ తప్ప బయ్యారం ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ నిర్మించకపోతే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పకపోతే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఢిల్లీలో ధర్నా చేసేందుకైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు.అనంతరం మంత్రి దయాకర్‌రావు ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌కు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాత గణేశ్, ఎంపీపీ మౌనిక, సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, సర్పంచ్ కోటమ్మ, మమత, ఎంపీటీసీ శైలజారెడ్డి, మాజీ ఎంపీపీ జయశ్రీ, నాయకులు సత్యరారాయణ, రాంముర్తి, శ్రీకాంత్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, సోమిరెడ్డి లక్ష్మణ్‌నాయక్, ప్రవీణ్, ఐలయ్య, వెంకన్న(ఆర్వీ), సుధాకర్‌రెడ్డి, సుగుణ, వెంకటపతి, నాగేశ్వరావు, శ్రీను పాల్గొన్నారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం చేపట్టిన దీక్ష సక్సెస్ అయింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షకు ఇల్లందు సింగరేణి కార్మిక సంఘం నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో మాల మహానాడు సంఘం, రాష్ట్ర కార్యదర్శి కోండ్రు ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్, బోడా లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్‌హెచ్‌పీఎస్, మల్లారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉపాధ్యాయ వేదిక, వీవోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షరాలు మరిపల్లి మాధవి ఆధ్వర్యంలో వీవోఏలు దీక్షకు మద్దతు పలికారు. గార్ల మండలం నుంచి కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీగా తరలివచ్చారు.
బీజేపీపై ఎంపీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజానీకం తీవ్ర మనోవేదనకు గురైందని కేంద్రంతో మాట్లాడలేని మంత్రి.. తెలంగాణలో పుట్టి ఏం ప్రయోజనమంటూ వారు బాధపడుతున్నారన్నారు. మానుకోట పోరాటాల పురిటి గడ్డ అని.. బిడ్డా కిషన్‌రెడ్డి ఖబాడ్దార్ అంటూ కవిత హెచ్చరించారు. బయ్యారం ఉక్కు తుక్కు కాదని.. మీ తుక్కు వదిలిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ తేకుంటే కిషన్‌రెడ్డి మంత్రి అయ్యేవాడు కాదని మంత్రి పదవి సీఎం కేసీఆర్ దయేనని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని అప్పటివరకు విశ్రమించేది లేదని స్పష్టంచేశారు.
గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మల సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. బయ్యారంలో నాణ్యమైన ఖనిజం ఉందని జీఎస్ఐ, సెయిల్ వంటి కేంద్ర బృందాలు తేల్చిచెప్పాయని చెప్పారు. ఉక్కు పరిశ్రమ కావాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయలేని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. కాలయాపన చేయకుండా కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై అక్కసుతోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. గిరిజన దేవతలు సమ్మక్కసారలమ్మల సాక్షిగా ఉక్కుపై అబద్ధాలు మాట్లాడిండు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే రాజీనామా చేయాలి.
– డీఎస్ రెడ్యానాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే
బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం తలపెట్టిన ఉద్యమానికి యావత్ తెలంగాణ అండగా ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో స్పష్టమైన హామీ వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా మోక్షం లభించలేదు. కేంద్రం స్పందించకపోతే అందరం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తాం.
– బానోత్ శంకర్‌నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
ఉక్కు పరిశ్రమపై కేంద్రం కాలయాపన చేస్తూ యువత ఆశల్ని నీరుగార్చవద్దు. ఫ్యాక్టరీ నిర్మిస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దశాబ్దాలుగా వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ వందల మిలియన్ టన్నుల ఖనిజం ఉంది. ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి.
– అంగోత్ బిందు, జడ్పీ చైర్పర్సన్, మహబూబాబాద్
సమైక్యపాలనలో బయ్యారం ఇనుప ఖనిజం ఆంధ్రాకు తరలిపోతుంటే ఉద్యమం చేసి తెలంగాణ వనరులను రక్షించుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా పోరాటం ద్వారానే ఉక్కు పరిశ్రమను సాధించుకుంటం. స్వయం గా సీఎం కేసీఆర్ పలుమార్లు పీఎంను ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరినా
ఊసెత్తకపోవడం దుర్మార్గం. – తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ
బయ్యారం ఉక్కు విషయంలో ఉద్యమం అప్పుడే కుట్రలను తిప్పికొట్టాం, ఇప్పుడు ఊరుకుంటామా. ఇద్దరు ఎంపీలతోనే రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. ఇప్పుడు కేంద్రం మెడలు వంచి బయ్యారంలో పరిశ్రమ సాధించలేమా. ఉక్కు పరిశ్రమ కోసం ఏండ్లుగా తపిస్తున్నాం. ఆకాంక్ష నేరవెర్చకుంటే మరో ఉద్యమం తప్పదు.
– అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎంపీ, మహబూబాబాద్