మరిపెడ, జూన్ 22: ‘అమరుల త్యాగఫలమే తెలంగాణ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. సమైక్య రాష్ట్రంలో దోపిడీకి గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని సీఎం కేసీఆర్ ఉద్యమించారన్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో వారి ఆశయసాధనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి, కులవృత్తిదారులకు చేయూత, సాగు రంగానికి అందిస్తున్న ఊతంతో పల్లెలు ప్రగతి పథంలో పరిఢవిల్లుతున్నాయని చెప్పారు.
అనంతరం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారితో పాటు మున్సిపల్ కార్యాలయంలో అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూరాకూమారి, ఎంపీపీ గుగులోత్ అరుణా రాంబాబు, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ గాదే అశోక్‌రెడ్డి, కౌన్సిలర్లు విసారపు ప్రగతీ శ్రీపాల్‌రెడ్డి, పానుగోత్ సుజాతా వెంకన్న, హతీరాం, మాచర్ల స్రవంతి, మక్సూద్, వుప్పల నాగేశ్వరరావు, తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్, ఎంపీడీవో కేలోత్ ధన్సింగ్, పద్మశాలీ సంఘం మండల అధ్యక్షుడు దిగజర్ల శ్రీనివాస్, జాటోత్ బాలాజీ పాల్గొన్నారు.