మహబుబాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) తీసుకొని వాటి ఎలా నింపాలి.. ఏం నింపాలి అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వారి వద్దకు వెళ్లినా వారికి కూడా ఈఎఫ్ నింపడం పరీక్షగా మారడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
ఏజెన్సీలోని ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులతో సర్ ప్రక్రియ ముందుకు సాగడం కష్టంగా మారింది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో కీలక పాత్ర పోషించే బీఎల్వోలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బీల్వో పరిధిలో 600 నుంచి 1200 మంది వరకు ఓటర్లుంటున్నారు. అయితే వీరిలో అత్యధికులకు చదువు రాకపోవడంతో ఇచ్చిన ఫామ్ నింపలేక పోతుండడంతో వాటిని తీసుకునేందుకు వారు పలుమార్లు తిరగాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వారి నుంచి వివరాలు తీసుకొని స్వయంగా బీఎల్వోలే నింపాల్సిన పరిస్ధితి నెలకొంది.
మరికొన్ని చోట్ల నింపేవారికి బీఎల్వోలు, సూపర్వైజర్లు సలహాలు, సూచనలు ఇవ్వాల్సి వస్తున్నది. దీనికి తోడు వ్యవసాయ సీజన్ కావడంతో గిరిజనులు తాళాలు వేసి ఇంటిల్లిపాది పనులకు వెళ్తుండడంతో ప్రక్రియ ఆలస్యమవుతున్నది. దీనికి తోడు ఎలాగోలా తీసుకున్న పత్రాలను డిజిటలైజేషన్ చేయడం కూడా ఏజెన్సీలో ప్రహసనంగా మారింది. ఏజెన్సీలోని చాలా గ్రామాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఫామ్స్ అప్లోడ్ వేగవంతంగా జరగడం లేదు. గ్రామాల్లో పత్రాలు సేకరించి సిగ్నల్ ఉన్నచోట కూర్చొని డిజిటలైజేషన్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 24 వరకు డిజిటలైజేషన్ పూర్తికావాలని అధికారులు ఆదేశిస్తుండడంతో బీఎల్వోలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొన్నిచోట్ల బీఎల్వోలకు కూడా సర్పై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో, ఓటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే స్థానికంగా ఓటు ఉండి వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి పలుమార్లు ఫోన్లు చేసినా రావడం లేదు.
మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి ఇది..
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల, కొత్తగూడ, గూడూరు, గంగారం పూర్తిగా ఏజెన్సీ మండలాలు. వీటి పరిధిలోని గ్రామాల్లో ఈఎఫ్ల పంపిణీ సజావుగా సాగినా, పత్రాలు తీసుకోవడం, డిజిటలైజేషన్ చేయడం మందకొడిగా సాగుతున్నది. బయ్యారం మండలంలోని 44 బూతుల్లో 37,864 మంది ఓటర్లుండగా 3,703 మంది పత్రాలు వెనక్కి తీసుకొని డిజిటలైజేషన్ చేశారు. గార్లలో 31 బూతుల్లో 30,826 మందికి 2,770, గూడూరులో 51 బూతుల్లో 48,229 మందికి 7,300, గంగారంలో 17 బూతుల్లో 9,201 మందికి 1,416, కొత్తగూడలో 23,843 మంది ఓటర్లకు 3,404 మంది ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేశారు.
2002 జాబితాకు సెర్చ్!
హనుమకొండ చౌరస్తా, జూలై 7: కచ్చితమైన ఓటర్లను నిర్ధారించేందుకు ఎన్నికల కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో చివరగా చేపట్టిన జాబితా ఆధారంగా చేసుకుని మ్యాపింగ్ చేయగా, ఇప్పుడు తమ పేరు, బంధువుల కోసం విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ మొదటి కాలమ్లోనే 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాలని ఎన్నికల సంఘం సూచించడంతో పేర్లు దొరకక, ఒకవేళ ఉన్నా ఎపిక్ నెంబర్ తెలియక ఓటర్లు సతమతమవుతున్నారు. ముఖ్యంగా 24 ఏళ్ల క్రితం తమ ఓటరు సంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సీరియల్ నంబర్, పోలింగ్ స్టేష న్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఫారం నింపడంలోనూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్ సర్వే నత్తనడకన సాగుతున్నది.
ఊరు, ఇల్లు మారిన వారి సమస్య మరింత జఠిలం
ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిలో వివరాలను సక్రమంగా భర్తీ చేయకపోవడంతో సమస్య తీవ్రతరంగా మారుతోంది. ముఖ్యంగా ఊరి నుంచి పట్టణానికి వచ్చినవారు, ఇల్లు కిరాయి మా రిన వారికి కష్టమవుతోంది. 2002 జాబితాలో పేరు లేకపోతే మా ఓటు పోతుందా? ఉంటుం దా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఊరు, ఇళ్లు మారినవారి మెదళ్లలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.