పాట్నా: మధ్యాహ్న భోజనంలో ఉప్పునకు బదులు సర్పును వంటవాడు కలిపాడు. ఈ నేపథ్యంలో ఆ భోజనం తిన్న తర్వాత 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బీహార్‌లోని నలంద జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Students Fall Ill) మంగళవారం మధ్యాహ్నం పరాసిలోని మిడిల్ స్కూల్‌కు సోయాబీన్ రైస్‌తో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఒక ఎన్జీవో సంస్థ సరఫరా చేసింది. కొంతమంది విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఆహారంలో ఉప్పు తక్కువగా ఉన్నదని ఫిర్యాదు చేశారు.
కాగా, కిచెన్ రూమ్‌లో ఉప్పు, డిటర్జెంట్ పౌడర్ డబ్బాలు ఒకేచోట ఉండటంతో వంట వ్యక్తి పొరపాటుపడ్డాడు. సాల్డ్కు బదులుగా సర్పు పౌడర్‌ను ఆ ఆహారంలో కలిపాడు. ఆ భోజనం తిన్న తర్వాత 36 మంది బాలికలు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో పాటు వాంతులు చేసుకున్నారు. స్కూల్లో ప్రాథమిక చికిత్స తర్వాత ఆ విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ ఆ ఆసుపత్రిని సందర్శించారు. ప్రభావిత విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని మీడియాతో అన్నారు.