సుబేదారి, మార్చి 9: పోలీసు శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. పోస్టింగ్‌లు పొందిన కొద్ది రోజులకే బదిలీ అవుతున్నారు. పైరవీలతో లక్షలాది రూపాయలు పెట్టి పోస్టింగ్ పొంది, బాధ్యతలు చేపట్టిన కొందరు ఇన్స్పెక్టర్లపై కొద్ది రోజులకే వేటు పడడంతో తలలు పట్టుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సైల నుంచి ఏసీపీల వరకు సాధారణ బదిలీలు కాగా ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా గత నెల 7, 10 తేదీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొదటి విడుతలో 28మంది బదిలీ కాగా, చాలామంది వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారే ఉన్నారు. అందులో చాలామంది పైరవీలతో లక్షలాది రూపాయలు పెట్టి అధికార పార్టీ నేతల సిఫారసుతో పోస్టింగ్‌లు పొందినట్లు ప్రచారంలో ఉంది. రెండో విడుతలో తొమ్మిది మంది బదిలీ అయ్యారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల సిఫారసులతోనే జరిగినట్లు తెలిసింది. వరంగల్ సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ పరిధిలోని నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీల విషయంలో ప్రభుత్వంలో కీలకనేత సిఫారసు చేయ గా, అదే జోన్ల పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
తమ నియోజకవర్గంలో మీ పెత్తనం ఏందని అభ్యంతరం తెలిపి, తమకు అనుకూలంగా ఉన్నవారికే పోస్టింగ్‌లు ఇప్పించుకున్నట్లు ప్రచారం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు తమ నియోజకవర్గాల ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌ల విషయంలో అనుచరులతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలో కొత్తగా పోస్టింగ్ పొందిన ఓ ఇన్స్పెక్టర్ రూ.25లక్షలు, నగర శివారులో పోస్టింగ్ పొందిన ఇన్స్పెక్టర్ రూ.20లక్షలు ముట్టజెప్పి పోస్టింగ్ తెచ్చుకున్నట్లు తెలిసింది. వరంగల్ నగరంలో ఏడాదిన్నరగా పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లు తమను బదిలీ చేయొద్దని అధికార పార్టీ నేతను పలుమార్లు కలిసి రెక్వెస్ట్ చేసుకున్నారు. సడన్‌గా తన నియోజకవర్గంలో కొత్తవారు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడంతో ఈ ముగ్గురు తలలు పట్టుకున్నారు. ఇక మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీల విషయంలో మొదటి విడుత బదిలీల్లో కేయూసీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన అబ్బయ్య పరకాలకు బదిలీ కాగా, ఖమ్మం నుంచి వచ్చిన శ్రీధర్‌కు కేయూసీ పోస్టింగ్ ఇచ్చారు. మూడు రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి నియామకాలకు రాజకీయ కోణంలో బ్రేక్ పడింది. ఇక వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల బదిలీల విషయంలో అధికార నేతల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది. ఈపంచాయతీ ఇన్చార్జి మినిస్టర్ దృష్టికెళ్లగా, చివరికి ఎమ్మెల్యేల ఆమోదంతోనే పోలీస్ ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ల బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. వెస్ట్ జోన్లో రూ.15 లక్షలు పెట్టి పోస్టింగ్ తెచ్చుకున్న ఓ ఇన్స్పెక్టర్ కొద్ది రోజులకే బదిలీ కావడంతో షాక్ తిన్నాడు. అతడు ఎస్సై నుంచి ఇక్కడే ప్రాధాన్య పోస్టింగ్ చేస్తున్నాడు.
ఏసీపీల బదిలీల్లోనూ..
ఏసీపీల బదిలీల వ్యవహారం కూడా అనేక మలుపులు తిరిగాయి. ఇద్దరు రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ లా అండ్ ఆర్డర్ ప్రాధాన్య పోస్టింగ్‌లను దక్కించుకోవడం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 110 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. వీరిలో వర్ధన్నపేట ఏసీపీ డి.రఘుచందర్ జగిత్యాలకు, వర్ధన్నపేటకు సికింద్రాబాద్ నుంచి నర్సయ్య, మామునూర్ నుంచి సి.సతీష్‌బాబు డీజీపీ ఆఫీస్, ఇక్కడికి కొత్తగూడెం నుంచి అబ్దుల్ రెహమాన్ నియామకమయ్యారు. కే దేవేందర్‌రెడ్డి జనగామ నుంచి హనుమకొండ, జనగామకు దామోదర్‌రెడ్డి నియామకమయ్యారు. పీ తిరుమల్ నర్సంపేట నుంచి వరంగల్ ట్రాఫిక్, ఎం భోజరాజు వరంగల్ ట్రాఫిక్ నుంచి రామగుండం సీసీఎస్, పీ డేవిడ్‌రాజ్ కాజీపేట నుంచి కరీంనగర్ పీటీసీ, వి.కిరణ్‌కుమార్ హనుమకొండ నుంచి నర్సంపేటకు బదిలీ అయ్యారు. రెండు రోజుల వ్యవధిలోనే తిరుమల్ వరంగల్ ట్రాఫిక్ నుంచి కాజీపేట బదిలీ కాగా, మామునూర్‌కు సతీష్‌బాబు తిరిగి అక్కడే పోస్టింగ్ పొందారు. మళ్లీ ఈనెల 2న మా మునూరు నుంచి సతీష్‌బాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ నుంచి బి.తిరుపతి వచ్చారు.
వరంగల్ ట్రాఫిక్‌కు తొలుత నర్సంపేటలో పనిచేసిన తిరుమల్ బదిలీకాగా, రెండు రోజుల్లోనే కాజీపేట ఏసీపీగా నియామకమయ్యారు. ట్రాఫిక్‌కు డీజీపీ ఆఫీస్ నుంచి టి.సత్యనారాయణ పోస్టింగ్ పొందారు. ఏసీపీల బదిలీల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసుతోనే జరిగినట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు ఏసీపీలు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. పైరవీలతో పోస్టింగ్‌లు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బదిలీలతో నిజాయితీ, ప్రతిభ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఏసీపీలకు పోస్టింగ్‌లు దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పైరవీలకే ప్రాధాన్యం ఉందని కొందరు నిజాయతీ పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సైల విషయంలో కొద్ది రోజుల క్రితం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పది మంది బదిలీ అయ్యారు. రెండు రోజుల్లో తిరిగి పాత స్థానానికే వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొందరు ఇన్స్పెక్టర్లు, ఏసీపీలకు బదిలీ తప్ప లేదు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్థానికతగా పనిచేస్తున్న వారంతా బదిలీ అయ్యారు. ముఖ్యంగా అధికార నేతల అండదండలతో పోస్టింగ్ పొందిన కొందరు ఇన్స్పెక్టర్లు వారిలో ఉన్నారు.