హనుమకొండ, మార్చి 20 : ట్రాన్స్‌కో వరంగల్ జోనల్ చీఫ్ ఇంజినీర్‌పై ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్‌కో జోనల్ ఆఫీస్‌లో ఆంక్షల కత్తి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్‌కోలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. చీఫ్ ఇంజినీర్ జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌పై ట్రాన్స్ కో అధికారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది.
ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అసోసియేషన్లు, యూనియన్లు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన కథనంతో ఒకటవుతూ ఆంక్షలపై పోరుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగులు, ఇంజినీర్లు కలిసి ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఇంజినీర్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. అలాగే శుక్రవారం ములుగురోడ్డు ట్రాన్స్‌కో కార్యాలయంలో జరిగిన టీవీఏఈ జేఏసీ సన్నాహక సమావేశంలో కూడా ‘ట్రాన్స్‌కో జోనల్ ఆఫీస్‌లో ఆంక్షల కత్తి’ కథనంపై జోరుగా చర్చ జరిగింది.
ట్రాన్స్‌కో వరంగల్ జోనల్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి, విద్యుత్ సౌదా కార్యాలయానికి వెళ్లొద్దని ఆంక్షలు విధించడం అన్యాయమని, వెంటనే సీఈ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకోవాలని సమావేశం సందర్భంగా డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు, యాజమాన్యాన్ని కలువడం సహజమని, ఇలా ఆంక్షలు విధించడం సరియైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఉద్యోగుల హకులను కాపాడేందుకు అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రా అధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు, ఇంజినీర్ అసోసియేషన్లు, కార్మికులు నిరసన, అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా పోరాటానికి సిద్ధమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.