ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కుండపోత పోసినట్లు వానకు వరంగల్ నగరం, మహబూబాబాద్, ఏటూరునాగారం సహా పలు ప్రాంతాల్లోని రహదారులు, లోతట్టు కాలనీలకు వరద పోటెత్తింది. వరంగల్ సీకేఎం హాస్పిటల్‌కు వెళ్లే రహదారిపై మోకాళ్ల లోతు వర్షం నీరు చేరింది. వరంగల్ అండర్‌బ్రిడ్జి, సీకేఎం హాస్పిటల్ ఏరియాల్లో మోకాల్లోతు వరద రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ బస్‌స్టేషన్, మహబూబాబాద్ జిల్లాకేంద్రం స్టేషన్‌రోడ్డులోని అండర్ బ్రిడ్జ్ ఏరియాలో వరద ప్రవాహానికి వాహనదారులు ముందుకు వెళ్లలేకపోయారు. అలాగే జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరడంతో ధాన్యం ముద్దయ్యింది.
– నమస్తే నెట్వర్క్, మే 27
జోరువానకు నగరం అతలాకుతలమైంది. వరంగల్ సీకేఎం హాస్పిటల్‌కు వెళ్లే రోడ్డు మోకాళ్ల లోతు వర్షం నీరు చేరి గర్భిణులు అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వరంగల్ అండర్‌బ్రిడ్జి, చిన్న బ్రిడ్జిల కింద వరద పోటెత్తడంతో వాహనదారులు బ్రిడ్జి దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కాలనీలకు వరద నీరు చేరగా లక్ష్మీనగర్, సాకరాశికుంట, కాశీకుంట, హంటర్‌రోడ్డులోని పలు కాలనీలలోకి వర్షం నీరు చేరి డైనేజీలు పొంగిపోర్లాయి. వరంగల్ చౌరస్తా, మేదరివాడ, హెడ్‌పోస్టాఫీస్ రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. హనుమకొండలోని బస్ట్‌స్టేషన్, కాకాజీ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే శాయంపేట, నల్లబెల్లిలోనూ భారీ వర్షం కురిసింది.
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని రామచంద్రాపురంకాలనీ, గోకుల మల్లయ్య బజార్, హనుమంతుని గడ్డ ఏరియాలో రోడ్లపై వర్షం నీరు నిలిచింది. స్టేషన్‌రోడ్డులోని అండర్ బ్రిడ్జ్‌లో వర్షం నీరు చేరింది. బ్రిడ్జ్ పక్కన వరద ఉండడంతో పాత బజార్‌కు వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందిపడ్డారు. దంతాలపల్లి, నర్సింహులపేట, కేసముద్రం, గూడూరు, బయ్యారం తదితర చోట్ల భారీ వర్షం కురిసింది.
జనగామ జిల్లా చిల్పూరు, పల్లగుట్ట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. లారీలు సరిగ్గా రాక, ధాన్యం నింపేందుకు బస్తాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో వర్షం దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. కుదురుపల్లి వాగు వరద నీటితో ప్రవహించింది. కాటారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల చుట్టూ నీరు నిలిచింది. మల్హర్ మండ లం కొయ్యూర్‌లో ధాన్యం తడిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొనుగోలు కేంద్రాల్లో కుండపోత వర్షం కురిసింది. లారీల్లో ధాన్యం లోడింగ్ చేస్తుండగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
సమ్మక్కబరాజ్ వద్ద పెరిగిన నీటిమట్టం
కన్నాయిగూడెం, మే 27 : తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బరాజ్ వద్ద నీటిమట్టం 76.30 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి 4860 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఒక గేటును ఎత్తి 3వేల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు.