హనుమకొండ చౌరస్తా/వరంగల్ చౌరస్తా, మార్చి 10: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతకతో కలిసి వరంగల్, హనుమకొండల్లో కే-హబ్ సహా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
మంత్రుల కార్యక్రమాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ జర్నలిస్టుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వరంగల్ బస్టాండ్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మాత్రమే ఉండాలని మంత్రి సురేఖ ఆదేశించారు. దీంతో కొందరిని వేదిక నుంచి పంపే క్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి.. ఓ టీవీ చానల్ ప్రతినిధిని దుర్భాషలాడుతూ తోసివేశారు. అయినప్పటికీ మంత్రులు పట్టించుకోకపోవడంపై పలు జర్నలిస్టు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గతంలోనూ అదే పోలీస్ అధికారి జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించిన విషయాన్ని పలువురు యూనియన్ నాయకులు ప్రస్తావించారు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాగా కే-హబ్ ప్రారంభోత్సవం వద్ద పోలీసుల ప్రవర్తన చర్చనీయాంశమైంది. వారి తీరుపై ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులు, జర్నలిస్టులు మండిపడ్డారు. ఒక దశలో వీసీ, రిజిస్ట్రార్‌ను సైతం తోసేశారు. కే-హబ్‌ను ప్రారంభించిన మంత్రులు లోపలికి వెళ్లి చూస్తుండగా డీసీపీ బారి, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి కేయూ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్నారు. జర్నలిస్టులను సైతం లోపలికి పంపకపోవడంతో బయటనే ఉండాల్సి వచ్చింది. లోపలికి వెళ్లిన మంత్రులు అక్కడే మీడియాతో మాట్లాడారు. లోపలికి అనుమతించాలని మరికొందరు జర్నలిస్టులు పోలీసులను కోరినా అంగీకరించలేదు. ఇదిలా ఉండగా అసలు కే-హబ్ ఎవరు కట్టించారు..? ఎవరు ప్రారంభిస్తున్నారు అని అక్కడ ఉన్నవారు అని చర్చించుకున్నారు.
వరంగల్ బస్టాండ్ జంక్షన్లో దివ్యాంగులకు స్కూటీలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మొక్క నాటి లక్ష వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని పది ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, కాకతీయ యూనివర్సిటీలో కే-హబ్, భారతరత్న పీవీ నర్సింహారావు నాలెడ్జ్ సెంటర్, మెన్స్ హాస్టల్, సమ్మక, సారలమ్మ ఉమెన్స్ హాస్టల్స్, అకాడమిక్ బ్లాక్-3, ఎంబీఏ బిల్డింగ్, మెన్ డైనింగ్ హాల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రెండో ఫ్లోర్ ప్రారంభోత్సవాలు, ప్రహరీ, హనుమకొండ సమ్మయ్యనగర్‌లో సమగ్ర వరద నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపనలు, బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్ ఆధునీకరణ పనుల శిలాఫలకాల ఆవిషరణ, ఎంజీఎం దవాఖాన పిల్లల వార్డులో చిన్నారుల క్రీడా సామగ్రి ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు సుమారు రూ.250 కోట్లతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రూ.68కోట్లతో 11 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. ప్రహరీ లేకపోవడం వల్లే భూములు అన్యాక్రాంతమయ్యాయని, వర్సిటీ భూములు కబ్జాకు గురికాకుండా సర్వే చేసి ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగింటిని ప్రభుత్వం అమలు చేసిందని, 11న భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిగతా వాటిని కొద్దిరోజుల్లోనే అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నగరంలో మూడేళ్లలో ఏటా లక్ష మొక్కలు నాటడమే లక్ష్యమని, దీన్ని నగరంలోని కాలనీవాసులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కేయూ వీసీ రమేశ్, రిజిస్ట్రార్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి పర్యటనలో కాంగ్రెస్ నాయకులు క్రమశిక్షణ, ప్రొటోకాల్ మరిచి ఇష్టారీతిన ప్రవర్తించారు. అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత హాజరైన వరంగల్‌లో సభావేదికపై ఏ హోదా లేని కాంగ్రెస్ నాయకులు కనిపించడంపై పలువురు కార్పొరేటర్లు ఆగ్రహించారు. వారు ఏ హోదాలో వేదికపైకి వచ్చారని పలువురు కార్పొరేటర్లు సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేశారు. 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల సునీల్ వేదికపై ఉండగానే అదే డివిజన్‌కు చెందిన మీసాల ప్రకాశ్ మైక్ తీసుకొని మాట్లాడడం, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, ఆకుతోట శిరీష్, కరాటే ప్రభాకర్, మంతెన సునీత తదితరులు వేదికపైకి రావడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.