Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) ను పదవి నుంచి తప్పించాలంటూ అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెట్టేందుకు విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అందులోభాగంగా లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు మంగళవారం నోటీసులు అందజేశాయి. అయితే ఆ నోటీసులలో లోపాలు ఉన్నట్లు లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి. కొన్ని సందర్భాలను ప్రతిపక్ష సభ్యులు పదేపదే అందులో ప్రస్తావించినట్లు తెలిపాయి.
అయితే ఆ నోటీసును పూర్తిగా తిరస్కరించడానికి బదులుగా అందులోని లోపాలను సవరించాలని స్పీకర్ ఓం బిర్లా సెక్రటేరియట్‌ను ఆదేశించినట్లు సమాచారం. సవరించిన నోటీసు అందిన తర్వాత నిర్దేశించిన నిబంధనల ప్రకారం వాటిని పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. మార్చి 9న బడ్జెట్ సెషన్ రెండో దశ ప్రారంభమైన తర్వాత ఈ నోటీసును లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబెపై చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాల నేపథ్యంలో విపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాయి.