నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 1 : లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున మహిషుడిని సంహరించింది. చెడుపై ‘మంచి’ సాధించిన విజయంగా ఏటా ఆ రోజున విజయ దశమి పర్వదినం కొనసాగుతున్నది. కాగా, గురువారం వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలు చోట్ల రావణ ప్రతిమల దహనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉర్సు రంగలీలా మైదానంలో దసరా ఉత్సవా లు ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిర్వహించే రావణ ప్రతిమ దహనం ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. కిక్కిరిసే జనాలు.. ఆటాపాటలు.. యువత కేరింతల నడుమ వేడుక అంబరా న్నంటనున్నది. సుమారు 70-75 అడుగుల భారీ రావణ ప్రతిమతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ, తాగునీరు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఏఎస్పీ శుభం ప్రకాశ్, మిల్స్‌కాలనీ సీఐ మైదానాన్ని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. అలాగే చిన్న వడ్డేపల్లి చెరువు, ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితిలు సిద్ధమయ్యాయి.