చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటున్నాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు. ఈ పండుగ సందర్భంగా రావణ వధ, జమ్మిచెట్టుకు పూజ చేయడం ఆచారంగా వస్తున్నది. దసరా రోజు దుర్గా మాత ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వేడుకలను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు.
కరీమాబాద్: ఉర్సు రంగలీలా మైదానంలో, రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో, కాశీబుగ్గలోని చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలోని పద్మానగర్‌లో ఉత్సవ కమిటీలు సర్వం సిద్ధం చేశాయి. ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు కళాకారులతో పలు ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లతో కనుల పండువగా నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు, నాయకులు పాల్గొననున్నారు. వివిధ శాఖల అధికారులు సైతం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.