వరంగల్ చౌరస్తా/గిర్మాజీపేట/కృష్ణకాలనీ : పూల పండుగకు వేళయ్యింది. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా వాకిళ్లన్నీ పూదోటలుగా మారనుండగా ఊరూవాడ ఆడబిడ్డల ఆటాపాటలతో హోరెత్తనున్నది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాలతో పండుగను వైభవంగా జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ కోసం కావాల్సిన గునుగు, తంగేడు, తదితర పూలు, దుస్తులు, ఇతర పండుగ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు, మెయిన్ సెంటర్లన్నీ జనంతో నిండిపోయి సందడిగా కనిపించాయి. ముఖ్యంగా హనుమకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తా, పోస్టాఫీస్ సెంటర్, సీకేఎం హాస్పిటల్ దారిలో వాహనదారులు, పాదచారులతో కిటకిటలాడాయి. బుధవారం రాత్రి వరంగల్‌చౌరస్తా చుట్టూ ఉన్న పలు వీధులు రాకపోకలతో రద్దీగా మారా యి. అలాగే బట్టలబజార్, పిన్నవారివీధి, మేదరివాడ, జేపీఎన్రోడ్, స్టేషన్రోడ్తో పాటు అండర్‌బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించకపోవడంతో బీట్‌బజార్ వరకు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నర్సంపేట రూరల్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా బంతిపూలకు భలే గిరాకీ ఉంది. నర్సంపేట మండలంలోని గురిజాల, లక్నెపల్లి, పర్శనాయక్‌తండా, మాధన్నపేట, నర్సింగాపురం గ్రామాల రైతులు తాము వేసిన బంతిపూలు నర్సంపేట, వరంగల్ మార్కెట్లలో అమ్ముతుంటారు. సాధారణంగా కిలో రూ.80 ఉండగా పండుగ సమయంలో రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. సద్దుల బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బంతిపూలకు ఫుల్ డిమాండ్ వచ్చింది.