‘సంపూర్ణ బంద్ పాటించి న్యాయమైన మా డిమాండ్‌కు సమ్మతి తెలపండి.. ఇక్కడ నిరసన ఢిల్లీకి తాకాలి’ అని బీసీ జాక్ ఇచ్చిన పిలుపునకు సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో రెండు మూడు రోజులుగా బీసీ సమాజం సన్నాహక కార్యక్రమాలు నిర్వహించింది. మరో వైపు బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
వరంగల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌ను విడుదల చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం బీసీ సమాజం కాంగ్రెస్ సర్కారుపై అన్నిస్థాయిల్లో ఒత్తిడి పెంచింది. బీఆర్ఎస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు 2018లో చేసిన 34 శాతం రిజర్వేషన్ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు ఇటు హైకోర్టుకు, అటు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి తాము పెంచిన రిజర్వేషన్లను అమలును అడ్డుకున్నదని ఆధారాలతో సహా సమాజం ముందు పెట్టింది. అయితే, బీఆర్ఎస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధిలేదని, తమకు మాత్రమే ఉందని మొదటి నుంచి నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది.
అది తప్పులతడకగా ఉందని జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ మేధావులు ప్రొఫెసర్ మురళీధర్‌రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు సహా యావత్ బీసీ మేధావివర్గం తప్పుబట్టింది. బీసీ వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో తిరిగి కులగణన చేపట్టడం, అసెంబ్లీలో తీర్మానం, ఆమోదం కోసం గవర్నర్‌కు బిల్లు పంపడం, ఆ బిల్లు పెండింగ్‌లో ఉండగా 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ జారీ చేయడం, దానిపై హైకోర్టుకు వెళ్లడం, కోర్టు విచారిస్తున్న క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం, హైకోర్టు ఆర్డినెన్స్‌పై స్టే విధించడం, దీంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించడం, దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కొట్టివేసిన విషయం తెలిసిందే.
తాము చేసిన రిజర్వేషన్ చట్టవిరుద్ధమని, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఆ చట్టం నిలవదనే విషయం తమను మోసం చేసిందని, తమకు న్యాయం చేసేవరకు పోరాటం ఆగదని బీసీ సమాజం డిమాండ్ చేస్తున్నది. అందులో భాగంగానే శనివారం తెలంగాణ వ్యాప్తంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ నినాదంతో బీసీ సమాజం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఎన్డీ సహా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ శ్రేణులను ఎక్కడిక్కడ బీసీ బంద్‌ను పాటించడమే కాకుండా బీసీ వర్గాలకు సంఘీభావం ప్రకటించే కార్యాచరణ తీసుకోవాలని పిలుపునిచ్చింది.
దీంతో కాంగ్రెస్, బీజేపీలు తామెక్కడ వెనకబడిపోతామేమోనని బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ న్యాయస్థానాల్లో నిలిచే చట్టాలు రూపొందించి, కేంద్రంలో అధికారంలో ఉండి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన బీజేపీ.. ఇలా రెండు పార్టీలు బంద్ పోటీలో వెనుకబడి బీసీ సమాజం దృష్టిలో పలుచబడతామని గ్రహించి కొత్త ఎత్తుగడలు వేశా యని బీసీ సమాజం మండిపడుతున్నది. మొత్తానికి నేటి బీసీ బంద్‌కు అన్నివర్గాల నుంచి సంఘీభావం వ్యక్తం అవుతున్నది. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.
ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హమనే నిబంధనను సర్కారు తొల గించింది. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదని బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటిదాకా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల రాజకీయం నడిపించింది, తీరా ఇప్పుడు ఆర్డినెన్స్‌పై కోర్టు స్టే విధించడం, ఎన్నికల ప్రక్రియ ఆగిపోయాక బీసీ వర్గాల ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించే చర్యలో భాగంగా సర్కారు ఈ నిర్ణయమని వాదన బలంగా వినిపిస్తున్నది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో ముగ్గురు పిల్లల ప్రస్తావన ఉండదు, ఆ తర్వాత ఆర్డినెన్స్‌లో దానికి చోటు ఉండదు కానీ, హఠాత్తుగా గుర్తొచ్చి ముగ్గురి నిబంధన ను ఎత్తేస్తారా? ఒకవేళ అదే గనుక అమలు కావాలంటే పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేయాలి. ఇందుకు అసెంబ్లీ సమావేశం కావాలి. దాని ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పిలవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ దశలవారీగా బీసీలను అణచివేస్తూ.. వంచిస్తూ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకుందని బీసీ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.