హనుమకొండ, సెప్టెంబర్ 17: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి. తిరుపతి పిలుపునిచ్చారు. బుధవారం కేయూ మొదటి గేటు వద్ద కేయూ పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణించిన అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, నైజాం నిరంకుశ ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు విరోచిత పోరాటాలు చేశారన్నారు. సాయుధ రైతాంగ పోరాటం దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు నాలుగు వేల మంది ప్రాణత్యాగం చేసి 3 వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు.
దున్నేవాడికి భూమి ఇచ్చారని, అలాంటి సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని మతోన్మాద, విచ్చిన్నకర పార్టీలు విమోచన, విలీనం అంటూ చరిత్రను వక్రీకరిస్తూ, మతం రంగును పులుముతున్నారని మండిపడ్డారు. మతోన్మాద కుట్రలను తిప్పికొట్టేందుకు విద్యార్థి, యువత సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు ఆరేగంటి నాగరాజు, కేయూ పరిశోధక విద్యార్థులు మాదాసి రమేష్, కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, జె.రాజారాం, స్రవంతి, రాజమణి, పీఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసల వినయ్‌కుమార్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, బొక్క ప్రవర్ధన్, డి.రంజిత్ పాల్గొన్నారు.