ములుగు : ములుగు జిల్లాలో పెద్దపులి సంచరించడం(Tiger roaming )కలకలంరేపుతున్నది. వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలోని పత్తి చేనులో పెద్దపులి పాదముద్రలు అటవీశాఖ అధికారులు కనుగొన్నారు.
శుక్రవారం వెంకటాపూర్ మండలంలో సింగరకుంట పల్లె నుంచి పాపయ్య పల్లె మీదుగా పత్తి చేనులో నుంచి పాలంపేట రామప్ప చెరువు దేవాదుల పైప్ లైన్ వరకు పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు కనుగొన్నారు. అక్కడ నుండి పులి ఎటువైపు వెళ్లింది తెలియాల్సి ఉందని ఎఫ్ఆర్వో డోలి శంకర్ తెలిపారు. కాగా, పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పులిని బంధించాలని కోరుతున్నారు.