కురవి/భీమదేవరపల్లి, అక్టోబర్ 31 : మారుపెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన ఉస్తం రాజు రెండో కుమార్తె నాగలక్ష్మితో సిద్దిపేట జిల్లా వెంకటాపురానికి చెందిన భాస్కర్‌తో ఈ నెల 29వ తేదీన కురవి వీరభద్ర స్వామి దేవస్థానంలో వివాహం జరిగింది. గురువారం మారుపెళ్లి కోసం వధూవరులను తీసుకువచ్చేందుకు బొలేరో వాహనంలో 30 మందికి పైగా కుటుంబసభ్యులతో సూదనపల్లికి బయలుదేరారు. అర్ధరాత్రి తర్వాత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపా ల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద కాలకృత్యాల కోసం డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఈ క్రమంలో బొలేరోను వెనుక నుంచి బోర్వెల్ వాహనం అతి వేగంగా ఢీకొట్టింది.
దీంతో రెడ్డబోయిన స్వప్న (17), రెడ్డబోయిన కళమ్మ(55), రెడ్డబోయిన శ్రీనాథ్(06) మృతిచెందారు. అనసూయ, అక్షయ, శివశంకర్, అక్షిత, చిక్కుడు దేవేందర్, రాజనర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ముల్కనూరు ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురు వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరామర్శించి వారి చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ వాహనం నడుపుతున్న వ్యక్తి గడ్డం నాగరాజు పరారీలో ఉండగా, ముల్కనూరు ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారంతా గ్రామాల్లో ముదిరాజ్ కులస్దులను భిక్షాటన చేసే కాకిపడుగులవారు.
వరంగల్‌చౌరస్తా : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులు ఎంజీఎం హాస్పిటల్ మొదటి గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. తమతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మట్టెవాడ పోలీసులు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.