రామాయంపేట, ఫిబ్రవరి 22: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని మల్లె చెరువు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. పట్టణంలో డ్రైనేజీల మురుగంతా ఈ చెరువులోకి చేరి దుర్వాసన వస్తుండడంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లె చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు నిధులు మంజూరు చేసి, కొంతమేర పనులు సైతం చేపట్టింది. అంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లె చెరువు సుందరీకరణ పనులు ఆగిపోయాయి. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పైసా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే ఆపేశాడు. మల్లె చెరువును ఆధునీకరిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
తీరా అధికారంలోకి వచ్చాక ఆధునీకరణను ప్రభుత్వం విస్మరించింది. మల్లె చెరువు రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పట్టణ అభివృద్ధిలో భాగంగా కొద్దిరోజుల క్రితం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దారి పొడువునా ఫెన్సింగ్, మురుగు కాల్వ స్లాబ్ వేసేందుకు రూ.25 లక్షల నిధులు మంజూరు చేశారు. కానీ, పనులు ఇంకా మొదలు కాలేదు. మల్లె చెరువు రామాయంపేట-సిద్దిపేట ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉంటుంది. చెరువు వద్ద మూలమలుపు ఉంటుంది.
దీంతో ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రామాయంపేట పట్టణంలోని మురుగు కాల్వల నీరంతా మల్లె చెరువులోకి చేరుతుండగా, మల్లె చెరువులోని నీరంతా కలుషితమై పచ్చగా రంగుమారింది. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో సమీప కాలనీ ప్రజలు దుర్వాసనతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈగలు, దోమలతో రోగాల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మల్లెచెరువును సుందరీకరించాలని కోరుతున్నారు. మల్లెచెరువు ఫెన్సింగ్, మురుగు కాల్వ స్లాబ్ కోసం నిధులు మంజూరైనట్లు రామాయంపేట మున్సిపల్ ఏఈ మహేశ్ తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.