గీసుగొండ/నర్సంపేట రూరల్/గిర్మాజీపేట, మే 3: వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేందుకు ఎండలో పనిచేయగా వడదెబ్బ తగిలింది. ఈ క్రమంలో గురువారం రాత్రి అపస్మారక స్థితికి చేరుకొని వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
నర్సంపేట మండలం ఇప్పల్తండాకు చెందిన రైతు అజ్మీరా మంగ్యానాయక్(44) మూడు రోజులుగా మక్కజొన్న చేనులో కంకులను కూలీల సహాయంతో ఏరిస్తుండగా వడదెబ్బ తాకింది. వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సంపేటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
వరంగల్ 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన రాయపురి మల్లయ్య(56) వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోగా అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ప్రథమ చికిత్స అందించేలోగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.