సుబేదారి, డిసెంబర్6: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సంచలనం రేపిన ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు దొరికారు. ఏడుగురు ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ షెహవాజ్ పూర్‌కు చెందిన అర్షాద్ అన్సారీ, బుడాన్వాసి షాఖీర్‌ఖాన్, బుల్దనా జిల్లా మోటల గ్రామస్తుడు హిమాన్షు బిగాంచంద్ జాన్వర్, బదౌన్ జిల్లా కక్రలాకు చెందిన మహమ్మద్ నవాబ్ హసన్, బడాయు జిల్లా కక్రలా గ్రామవాసి సాజిద్‌ఖాన్, మహారాష్ట్ర చికిల్లి తాలుకా సైగావ్ గ్రామానికి చెందిన అక్షయ్ గజానన్, ముల్దానా జిల్లా పునై మోటాలవాసి సాగర్ భాస్కర్ గోర్ కలిసి బ్యాంకుల దోపిడీకి ముఠాగా ఏర్పడ్డారు.
ఈ ముఠా హైదరాబాద్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని గూగుల్ ద్వారా బ్యాంకుల సమాచారాన్ని సేకరించే క్రమంలో రాయపర్తిలోని ఎస్బీఐలో దోపిడీ చేయడానికి అనువుగా గుర్తించారు. నవంబర్ 18న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి రాయపర్తి శివారుకు చేరుకుని, డ్రైవర్ హిమాన్షును తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారును వెనక్కి పంపించారు. అక్కడి నుంచి పంట పొలాల నుంచి బ్యాంకుకు వెళ్లి కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. సెక్యూరిటీ అలారం సౌండ్ రా కుండా, సీసీ కెమెరాల్లో కనిపించకుండా వైర్లు కట్ చేశారు.
అనంతరం స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో మూడు లాకర్లను తొలగించి, అందులో ఉన్న రూ. 13కోట్ల 61లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గ్యాస్ సిలిండర్, ఇతర సామగ్రిని బ్యాంకులో వదిలిపెట్టి తిరిగి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. మరునాడు ఏడు వాటాలు పంచుకొని మూడు బృందాలుగా విడిపోయి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో యూపీకి చెందిన అర్షాద్ అన్సారీ, షాఖీర్‌ఖాన్, హిమాన్షును పట్టుకొని 2.520 కిలోల బంగా రం, కారు, రూ. పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. ఈ ముఠా రాత్రి వేళ సెక్యూరిటీ గార్డు లేని బ్యాంకులను టార్గెట్ చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రతిభ చూపిన డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు నర్సయ్య, బోజరాజు, కిరణ్ కుమార్, ఆత్మకూరు, రఘునాథపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్ఫో ర్స్, కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని సీపీ అభినందించారు.