దేవరుప్పుల, ఏప్రిల్ 2 : మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్‌జోన్ కమిటీ సభ్యురాలు, ప్రెస్ టీం ఇన్చార్జి గుమ్మడవెల్లి రేణుకకు బుధవారం ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి కన్నీటి వీడ్కోలు పలికింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైరాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్గోడా అఖేలి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే.
ఛత్తీస్‌గఢ్ నుంచి రేణుక మృతదేహం మంగళవారం అర్థరాత్రి స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజల సందర్శనార్థం ఆమె మృతదేహాన్ని దొడ్డి కొమురయ్య స్థూపం వద్ద బుధవారం ఉంచగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు వేలాది మంది ప్రజాసంఘాల నాయకులు, సానుభూతిపరులు హాజరై నివాళులర్పించారు.
అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, నాయకులు పద్మకుమారి, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌రావు, శాంతక్క, విరసం నాయకులు కార్యదరి రివేరా, పాణి, జ్వాలాముఖి, శివరాత్రి సుధాకర్, రాము, వరంగల్ విరసం కన్వీనర్ కొడెం కుమార్, తెలంగాణ ఫ్రంట్ నాయకులు రవిచందర్, రమాదేవి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, గాజర్ల అశోక్ అలియస్ ఐతూ, గద్దర్ కుమారుడు సూర్యం, వెన్నెల, వరవరరావు కుమార్తెలు అనల, సహజ, పవన తదితరులు హాజరై రేణుక త్యాగాన్ని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వ దమన కాండను ఖండించడంతో పాటు ఆపరేషన్ కగార్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం అరుణోదయ, ప్రజామండలి విప్లవ సంఘాల పాటలు, డప్పువాయిద్యాల నడుమ వేలాది మంది పాల్గొన్న అంతిమయాత్ర నాలుగు గంటల పాటు కొనసాగి శ్మశానవాటికకు చేరుకుంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు సామూహికంగా చితికి నిప్పంటించగా అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.