ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబురాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గులాబీ జెండా రెపరెపలతో వాడవాడలా పండుగ వాతావరణం నెలకొననున్నది. ఇందులో భాగంగా మంగళవారం జెండా పండుగ నిర్వహించనుండగా అంతటా గద్దెలను అందంగా ముస్తాబుచేశారు. జెండా పండుగ పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో ప్రతినిధుల సభలు నిర్వహించనుండగా ఉమ్మడి వరంగల్‌లోని 12 సెగ్మెంట్లలో ఎక్కడికక్కడ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు సహా 5వేల మంది ఇందులో పాల్గొననున్నారు. ఈమేరకు ఊరూరా గులాబీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయి సభల నిర్వహణపై ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయభాసర్ సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– వరంగల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ పార్టీలో సంబురాలకు సమ యమైంది. ఊరు, వాడ అంతటా మంగళవారం గులాబీ జెండా పండుగ జరగనున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అన్నిచోట్ల జెండా గద్దెలను అందంగా తీర్చిదిద్దారు. జెండా పండుగ పూర్తి కాగానే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు జరుగనున్నాయి. నియోజకవర్గ పరిధిలోని అందరు ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు ఈ సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా నియోజకవర్గ స్థాయి సభలు జరగనున్నాయి. ఊరూరా గులాబీ జెండా పండుగ, నియోజకవర్గ స్థాయి సభల నిర్వహణపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాసర్ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. బీఆర్ఎస్లోని అన్ని వర్గాల నేతలు, ము ఖ్యులు, సీనియర్లు, కార్యకర్తలు తప్పకుండా ఈ సభలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల కోసం పార్టీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసిందని పేర్కొన్నారు.
నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభ ఎజెండా, సభ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించాలన్నారు. ప్రతినిధుల సభలో చేసే తీర్మానాల ప్రక్రియను సమష్టిగా పూర్తిచేయాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనాల తరహాలోనే నియోజకవర్గ ప్రతినిధుల సభను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని, ఈ సభకు ఐదు వేల మంది వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించడం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయడం, ప్రతినిధులకు స్వాగతం పలకడం.. దేశ, రాష్ట్ర స్థాయితో పాటు స్థానిక సమస్యలపై తీర్మానాలు చేయాలని సూచించారు. ఉపాధి హామీపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేపట్టిన ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని అభినందించారు. ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచాలని, వంట గ్యాస్, పెట్రో, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలని, వడ్ల కొనుగోలుపై కేంద్ర వైఖరిని ఖండించాలని, పంటల నష్టాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో తీర్మానాలు చేయాలని సూచించారు. తీర్మానాలను ఒకరు ప్రతిపాదిస్తే, మరొకరు బలపరచాలని అన్నారు. తీర్మానాల విషయంలోనూ సామాజిక సమతూకం పాటించాలని చెప్పారు. ప్రతినిధుల సభలో సూచనలను, సలహాలను పాటించాలని అన్నారు. మధ్యాహ్న భోజనంలోనూ మంచి రుచి, శుచికరమైన వంటకాలు పెట్టాలని చెప్పారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయాలని సూచించారు.