వరంగల్ చౌరస్తా, మే 6: ఎంజీఎం హాస్పిటల్లో వైద్యసేవలపై పర్యవేక్షణ కరువవుతున్నది. నిత్యం వందలాది రోగుల కు సేవలందించే అత్యసవర విభాగం(క్యాజువాలిటీ)లోనే వైద్యాధికారులు విధులకు ఆలస్యంగా హాజరవడమే గాక రాత్రివేళల్లో జూనియర్ డాక్టర్లకు బాధ్యతలు అప్పగించి తప్పుకొంటున్నారు. ఈ విభాగంలోకి తీసుకొచ్చిన పేషెంట్‌కి ఎక్స్ రే, స్కానింగ్, ఈసీజీ లాంటి పరీక్షలు చేసేందుకు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) హోదా ఉన్న వైద్యుడు గానీ, డ్యూటీ మెడికల్ ఆఫీసర్(డీఎంఓ) గానీ ప్రి స్క్రిప్షన్ ఫాంపై రోగి పూర్తి వివరాలు నమోదు చేసి సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇవేవీ పట్టనట్లు వైద్యాధికారులు విధులకు రాకుండా సంతకం చేయకపోవడంతో వివరాల నమోదులో ఇబ్బందులను ప్రస్తావించిన సిబ్బందిపై జూనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సమస్యకు క్యా జువాలిటీ, డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు తమకు అనుకూలంగా సులువైన పరిష్కారాన్ని కనుగొన్నా రు. ఇందుకోసం ముందుగానే సంతకం చేసిన ప్రిస్క్రిప్షన్ ఫాంలను జూనియర్ డాక్టర్లకు అందుబాటులో ఉంచి తాపీగా విధులకు ఎగనామం పెట్టేస్తున్నారు. జూనియర్లు సైతం పైస్థాయి అధికారుల మెప్పు కోసం తలాడిస్తున్నారు.
ఎంఎల్సీ కేసులో సంతకం కీలకం
మెడికో లీగల్ కేస్(ఎంఎల్సీ)లో క్షతగాత్రుడికి లేదా రోగికి అత్యవసర విభాగంలో నిర్వహించిన చికిత్స కీలకంగా పరిగణించబడుతుంది. అలాంటి కేసులు వచ్చినప్పుడు స్వయంగా సీఎంఓ లేదా డీఎంవో అతడి పూర్తి వివరాలతో పాటు గుర్తింపు చిహ్నాలు(ఐడెంటిఫికేషన్ మార్క్స్) సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలనే కోర్టు కీలకంగా పరిగణిస్తుంది. అలాంటి కీలక పత్రాలపై ఇష్టారీతిన సంతకాలు చేసి, వదిలివెళ్లడాన్ని రోగులు, కొందరు ఎంజీఎం ఉద్యోగులు సైతం తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్యాజువాలిటీ సేవలపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.