Gadeela gutta | మంగపేట, ఏప్రిల్ 29 : రమణక్కపేట శివారు గుట్టపై సుమారు మూడు వేల ఏళ్ల నాటి శిలాయుగపు ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ములుగు జిల్లా మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామానికి చేరుకోవాలి. అక్కడికి సమీపంలోని ఎర్రమ్మతల్లి తోగు నుంచి కాలినడకన సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర సుమారు 1000 ఫీట్ల ఎత్తైన గుట్ట పైకి వెళ్తే దట్టమైన అడవుల్లో ఉన్న ఈ పురాతన ఆనవాళ్లను చూడవచ్చు. దూరం నుంచి చూస్తే గుట్ట భాగమంతా ఎగుడు దిగుడుగా కనిపించినప్పటికీ గుట్టపై భాగంలో సువిశాలమైన భూభాగం ఉంది. సుమారు 3వేల ఏళ్ల క్రితమే ఇక్కడ శిలాయుగం నాటి ఆనవాళ్లున్నాయి. రాతి, మట్టితో తయారుచేసిన వస్తువులు కాలక్రమేణా చాలావరకు కనుమరుగయ్యాయి. ఆదిమానవుల కాలం నాటి ఎన్నో రాతి సమాధులు (డోల్మైన్స్) ఉన్నాయి. వీటిని రాక్షసగూళ్లుగా పిలుస్తున్నారు. వందల సంఖ్యలో ఉండే ఈ సమాధులు కాలక్రమేణా శిథిలమయ్యాయి. గుట్టపై వేల ఏళ్ల క్రితం రాతితో నిర్మించిన నీటి తొట్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాగరికత పెరిగే కొద్దీ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇక్కడ రెండు భారీ చెరువులు నిర్మించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గుట్టపైన ఏడాది పొడవునా పారే సేలయేటి జలధార ఉంది. నాగరికత వృద్ధి చెందిన తొలినాళ్లలో అప్పటి ప్రజలు ఇక్కడో ఆలయం నిర్మించే ప్రయత్నాలు కూడా చేసినట్లుగా ప్రచారంలో ఉంది.
గుప్తనిధుల తవ్వకాలతో ఆనవాళ్లు ధ్వంసం
మల్లూరు మొదలుకొని రమణక్కపేట-రాజుపేట పరిసరాలకు విస్తరించి ఉన్న ఈ గుట్టలపై గతంలో విచ్చలవిడిగా గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. ప్రధానంగా ఏడు దర్వాజల రాతికోట, గోడ, రాక్షసగూళ్ల ప్రదేశాలతో పాటు, మల్లూరు ఆలయానికి ఎగువ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వారు. దీంతో గుట్టపై ఉన్న పురాతన ఆనవాళ్లు, కోట ద్వారాలు, రాతి కట్టడాలు చాలావరకు ధ్వంసం కాగా కొన్ని ఆనవాళ్లు మిగిలాయి.
పరిశోధనలు చేస్తే వెలుగులోకి పూర్తి సమాచారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రమణక్కపేట గ్రామస్తుల సహకారంతో 2019లో టూరిజం శాఖ ఎండీ మనోహర్ బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. అంతకుమందు కూడా కొందరు చరిత్రకారులు పరిశీలించారు. ఆనవాళ్లను టూరిజం శాఖ అధికారులు గుర్తించాక ఈ గుట్ట ‘గడీల గుట్ట’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రదేశం దట్టమైన అడవుల్లో ఉండడం, దారి కూడా సరిగా లేనందున గుట్టపై ఉన్న రాతి కట్టడాల సమాచారం వెలుగులోకి రాలేదు. ఈ విషయాలపై పురావస్తు శాఖ లోతైన పరిశోధనలు చేస్తే పూర్వకాల కచ్చిత, సమగ్ర సమాచారం తెలిసే అవకాశముంది. అంతే గాక సహజసిద్ధ అందాలు, ప్రకృతి రమణీయతను కలబోసుకున్న ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ట్రెక్కింగ్ స్పాట్‌గా తీర్చిదిద్దితే ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
శాతవాహనుల కాలపు కోట, భారీ గోడ, సైనిక స్థావరాలు
ఈ గుట్టపై అడవుల్లో క్రూర మృగాల నడుమ శిలాయుగం నాడు మొదలైన మానవ ప్రస్థానం నాగరికత వృద్ధి చెందాక సుమారు 2వ శతాబ్దంలో ఈ ప్రాంతం శాతవాహనుల ఆధీనంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మల్లూరు శివారు గుట్టపై వెలసిన శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కూడా శాతవాహనుల కాలం నాటిదిగా దేవస్థాన చరిత్రలో పేర్కొనబడింది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులే గోదావరి నదికి దక్షిణ తీరాన ఉన్న ఈ గుట్టపై భాగాన్ని సురక్షిత ప్రదేశంగా ఎంచుకున్నారు. ఇక్కడ ఏడు దర్వాజల కోట, దుర్గం, వాటికి రక్షణగా భారీ రాతి ప్రహరీ, గుర్రపు శాలలు, కోనేరును నిర్మించినట్లు స్పష్టమవుతోంది. నేటికీ ఈ గుట్టపై నుంచి చూస్తే ఉత్తర దిక్కున కిందిభాగంలో ఉన్న సువిశాల భూభాగం, గోదావరి నది పరీవాహకమంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఎత్తైన ఈ ప్రదేశానికి పొరుగు ప్రాంతం వారు, శత్రువులు దాడికి వస్తే తేలిగ్గా పసిగట్టే అవకాశాలుండడం వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలోనే ఈ గుట్టపై శాతవాహనులు అప్పట్లో సైనిక స్థావరాలేర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శాతవాహనుల అనంతరం 13వ శతాబ్దం వరకు కాకతీయులు ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలించిన రోజుల్లో గోదావరి నదిని దాటి మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్లేటప్పుడు వారు కూడా ఈ ప్రదేశాన్ని సురక్షితంగా భావించి గుట్ట మీద అప్పటికే నిర్మాణమై ఉన్న కోట, సైనిక స్థావరాల వద్ద సేద దీరి వెళ్లే వారని ప్రచారంలో ఉంది. మల్లూరు హేమాచలక్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి అప్పట్లో సందర్శించినప్పుడు దేవస్థాన సమీపంలో పారుతున్న సెలయేటి జలధారకు చింతామణిగా నామకరణం చేసినట్లు ఇక్కడి అర్చకులు దేవస్థాన చారిత్రక ఇతిహాసంలో భక్తజనానికి ఉపదేశిస్తారు.
ట్రెక్కింగ్ స్పాట్‌కు అనుకూలం
రమణక్కపేట సమీపంలోని గడీల గుట్ట ప్రాంతం ట్రెక్కింగ్ స్పాట్‌కు ఎంతో అనుకూలంగా ఉంది. గతంలో టూరిజం ఎండీ, పలువురు అధికారులతో ఈ గుట్టపై ఉన్న కోట, రాతి గోడ, ఏడాది మొత్తం సహజసిద్ధంగా ఉబికివస్తున్న నీటి ఊట, ఆదిమానవుల కాలం నాటి డోల్మైన్స్ను పరిశీలించారు. ఈ గుట్టపై ఉన్న చెట్లలో కూడా కొన్ని విలువైన ఔషధ మొక్కలున్నట్లు అభిప్రాయపడ్డారు. మల్లూరులో హరిత హోటల్ నిర్మాణమైన నేపథ్యంలో గుట్ట ప్రాంతాన్ని ట్రెక్కింగ్ స్పాట్‌గా చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది.
– కల్యాణపు సుమన్, ఎకో టూరిజం, ప్రాజెక్ట్స్ మేనేజర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ