వరంగల్, జూన్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బుధవారం తరలివెళ్లారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు వచ్చిన జల ప్రదాత కేసీఆర్కు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచారు.
ప్రతి ఊరికి సాగునీరందించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేసేలా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోదావరి జలాలతో బీడు భూములను పచ్చని మాగాణిగా మార్చిన కేసీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్పై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట, ములుగు, హుస్నాబాద్, మంథని, భద్రాచలం, హుజూరాబాద్, ఇల్లందు నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా బీఆర్కే భవన్కు తరలిన ప్రజలు కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరై తిరిగి వెళ్లే వరకు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ అధినేతకు తామంతా అండగా ఉన్నామని చాటి చెప్పి అనంతరం తిరిగి వచ్చారు.