దేవరుప్పుల, జూన్ 18 : పాలకులు పని చేయిస్తారని కండ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. చివరకు ఓపిక నశించి దాతలు ఇచ్చిన విరాళాలతో గ్రామస్తులే కల్వర్టు కట్టుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామానికి బస్సు దిగి వెళ్లాలంటే గ్రామస్తులు నరకయాతన పడేవారు. మార్గమధ్యంలో ఉన్న లోలెవల్ కాజ్‌వేపై ఏడాదిలో ఆరు నెలలపాటు నీరు నిలిచే ఉండి, రోడ్డు పాకురు పట్టేది. వాహనదారులు ఆదమరిచి పోతే సర్రున జారి పడి గాయాల పాలయ్యేవారు.
బాటసారులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లేవారు. ఇక్కడ ప్రమాదాలు జరిగి ఇప్పటికే అనేక మందికి చేతులు, కాళ్లు, నడుములు విరిగిన ఘటనలున్నాయి. భారీ వర్షాలు కురిసినా, దేవాదుల నీరు వచ్చినా కాజ్వే పైనుంచే గ్రామంలోని వావిలాలతో పాటు మరికొన్ని చెరువులకు చేరుతుంది. అందుకే ఈ రోడ్డుపై కనీసం మూడు నెలల పాటు మోకాలు లోతు నీరు నిలిచి ఉంటుండగా, మరో మూడు నెలలు ఓ మోస్తరుగా ఉంటుంది. పైన ఉన్న పొలాల నుంచి వచ్చే నీరు ఇక్కడి నుంచే కిందికి వెళ్తుంది. రోజుల తరబడి నీరుండి రోడ్డు పాకురు పట్టి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

బంజరకు పోవాలంటే మరోమార్ంగ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బంజర క్రాస్ నుంచి గ్రామం వరకు రూ. 60 లక్షల ఎంఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్డు, కల్వర్టు మంజూరు చేయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోవడంలేదు. ఇంకా ప్రపోజల్ స్థాయిలోనే ఉన్నది. ఈ క్రమంలో ఇదంతా చూసి ఓపిక నశించిన బంజర గ్రామ సర్పంచ్ ధరావత్ చిరంజీవి పలువురు దాతలు, గ్రామస్తులు ఇచ్చిన విరాళాలతో పైపులు వేసి కల్వర్టు కట్టాలని నిర్ణయించి పనులు మొదలు పెట్టారు.
ఇది కార్యరూపం దాల్చగా, ముగింపు స్థాయిలో ఉన్నది. కల్వర్టు నిర్మాణంపై పీఆర్ డీఈ రామలింగాచారికి తెలుపగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కల్వర్టు నిర్మాణ స్థలానికి వచ్చి సలహాలు సూచనలు ఇచ్చారు. ఏఈ మహేశ్ అంచనాలు ఇవ్వడంతో దాని ప్రకారం సర్పంచ్ చిరంజీవి కల్వర్టు పనులకు ఉపక్రమించారు. రెండున్నర ఫీట్ల వైశాల్యం, 8 ఫీట్ల పొడవుతో కూడిన 9 పైపులు తెచ్చి, రోడ్డుపై మూడు వరుసలు వేసి మధ్యలో ధృడంగా ఉండడానికి కాంక్రీట్‌తో నింపి పనులు పూర్తి చేశారు. ఇక కల్వర్టుకు ఇరు వైపులా సైడ్‌వాల్ కట్టి, రాతి గుండ్లు నింపి, దానిపై మట్టితో ఫార్మేషన్ చేయాల్సి ఉందని, దీనిపై సీసీ పోస్తే రోడ్డు అందుబాటులోకి వస్తుందని సర్పంచ్ తెలిపారు.

గ్రామానికి ఇది అత్యవసరపని..
బంజర గ్రామానికి ఇది అత్యవసరమైన పని. నేను గెలిచిన నాటి నుంచి ఈ పనిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. అనేక సార్లు పీఆర్ అధికారులను అడిగితే పట్టించుకోలేదు. పండుగలు, పబ్బాలకు గ్రామానికి ఎవరు రావాలన్నా ఈ కాజ్‌వేను చూసి భయపడేవారు. అనేక మందికి ప్రమాదాలు జరిగాయి. ఏడాదిలో మూడు నెలలు రహదారిపై నడవడం కష్టంగా ఉండేది. పశువులు సైతం జారిపడేవి. వాహనాలు దాటాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోవాలె. ఎలాగైనా కల్వర్టు కట్టాలనే నిర్ణయానికి వచ్చాను. సుమారు రూ. 4 లక్షలు అవుతుందని అధికారులు తెలిపారు. నేను బీఆర్ఎస్ సర్పంచ్‌ని. ఎమ్మెల్యే వద్దకు పోలేని పరిస్థితి. మండలంలోని పలువురు దాతలను సంప్రదిస్తే సరే అన్నారు. ఉప సర్పంచ్ జోగు నాగయ్య ఓకే అన్నాడు. కల్వర్టు పూర్తి చేయించాను. మట్టి పనులు, సీసీ పూర్తి చేస్తే కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
– ధరావత్ చిరంజీవి, సర్పంచ్, బంజర