మూడు రోజుల నుంచి మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. నేలంతా నిప్పులకొలిమిలా భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడచూసినా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటడంతో పాటు వడగాలులు కూడా తోడై వాతావరణమంతా వేడిగా మారింది. ఉదయం 10గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలై మధ్యాహ్నం అసలు ఇంట్లోంచి కాలుబయట పెట్టకుండా చేస్తున్నది. సాయంత్రం వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రయినా దగడు పోక కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడిచినా ఫలితం లేక జనం విలవిలలాడుతున్నారు. ఈ నెల 27వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
– వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎండలు మండుతున్నాయి. మూడు రోజులుగా భూమిపై మంట పెడుతున్న పరిస్థితి ఉన్నది. పొద్దున ఏడు గంటల నుంచి ఎండ మొదలై పది గంటల వరకే వేడి తీవ్రంగా ఉంటున్నది. రాత్రి అయ్యే వరకు వేడి అలాగే ఉంటున్నది,. ఎండలకు తోడు వడగాల్పులు మరింత ప్రభావం చూపుతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో రాత్రి పూట వాతావరణం వేడిగానే ఉంటున్నది. ఉత్తర దిశ నుంచి వస్తున్న గాలులతో ఈ పరిస్థితి ఉంటున్నదని వాతావరణ శాఖ చెబుతున్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెల 27 వరకు ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఈసారి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని, ఈ కారణంగా ఎండలు ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయని నివేదికలు పేర్కొన్నాయి. తీవ్రమైన ఎండలతో రోడ్లపై జన సంచారం పూర్తిగా ఉండడం లేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అత్యవసరమైన పనులు ఉన్న వారు తప్పితే రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. మోటారు సైకిళ్లు, నడకతో వెళ్లేవారు ఈ సమయంలో దాదాపు బయటికి రావడం లేదు. ఎండలు, వేడిగాలుల తీవ్రత పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటున్నది.
ఎక్కువమంది ఇంటికే పరిమితం
ఎండల తీవ్రత సాధారణ జనజీవనంపై బాగా ప్రభావం చూపుతున్నది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. వడ్ల కాంటాలు పొద్దున, సాయంత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. తీవ్రమైన ఎండలతో హమాలీలు, రైతులు వాతావరణానికి అనుగుణంగా పనిచేసుకుంటున్నారు. ఎండలతో బయటికి వచ్చేవారు బాగా తగ్గిపోయారు. ఇంట్లో ఉన్న వారు ఉక్కపోతతో అవస్థ పడుతున్నారు. తీవ్రమైన వేడితో ఫ్యాన్లు తిరిగినా ఉక్కబోత తప్పడం లేదు. కూలర్లు వేసినా ఫలితం ఉండని పరిస్థితి. గంట రెండు గంటలకే నీళ్లు పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. అయినా ఇంట్లో సాధారణ వాతావరణం ఉండడంలేదు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు తోడు రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడంతో టీవీలు ఎక్కువ సేపు నడుస్తున్నాయి. దీంతో కరెంటు వినియోగం అత్యధికంగా ఉంటున్నది.
జాగ్రత్తలు అవసరం
ఎండలు తీవ్రంగా ఉండడంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వ యస్సుతో తేడా లేకుండా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలు, వేడి వాతావరణం, వడగాలులతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుందని, దీన్ని సరి చే సుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని చె ప్పారు. అదే పనిగా నీరు తీసుకోవడ మూ మంచిది కాదని, శరీర అవసరం మేరకు నీటిని తాగాలని సూచించారు. చల్లటి పదార్థాల వినియోగం మంచిది కాదని చెప్పారు. పిల్లలు, వృద్ధులు ఎండలో బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
