రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈ నెల 26నుంచి 11వ విడుత పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో 1,54,405 మంది, హనుమకొండ జిల్లాలో 1,37,436 మంది రైతులకు రూ.263,66,07,596 ఆర్థికసాయం అందనున్నది. రెండు జిల్లాల్లో కొత్తగా 12,971 మంది అన్నదాతలకు లబ్ధి చేకూరనుంది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానుండగా, గతంలో మాదిరిగా ఈ సారి కూడా సాగు భూమి విస్తీర్ణ క్రమంలో పంపిణీ జరుగనుంది. గతేడాది కంటే ఈ సారి ముందుగానే నగదు అందుతుండడంతో రైతు కుటుంబాల్లో అనందం వెల్లివిరుస్తున్నది.
వరంగల్, జూన్ 24(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్ : వ్యవసాయ రంగంలో సమూల మార్పుల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకం రైతు బంధు డబ్బులు ఈ నెల 26వ తేదీ నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుల ఆత్మహత్యలతో పాటు దిగుబడులను పెంచే ఉద్దేశంతో రూపొందించిన ఈ రైతు బంధు పథకం ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వమే సమకూర్చుతుండడంతో అన్నదాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 2018 సంవత్సరంలో ఊపిరి పోసుకున్న ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 10 విడుతల్లో డబ్బులు జమయ్యాయి. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో అదనంగా మరో 11,860 మంది, హనుమకొండ జిల్లాలో 1,111 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
వీరితో వరంగల్లో పంట పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య 1,54,405కి చేరనుండగా, ప్రస్తుత వానకాలం రూ.136,47,64,310 ఆర్థికసాయం అందనుంది. హనుమకొండలో 1,37,436 మంది రైతులకు రూ.127 కోట్ల 18 లక్షల 43 వేల 286 నగదు జమకానున్నది. పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు రెండు విడుతల్లో ఎకరానికి రూ.10 వేలు అందజేస్తున్నది. వానకాలం రూ.5 వేలు, యాసంగి రూ.5 వేల చొప్పున సీజన్ ప్రారంభంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ డబ్బులతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. అలాగే రైతుబంధు పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పంటల సాగు విస్తీర్ణం పెరిగిపోతున్నది. గతంలో భూములను బీడుగా ఉంచిన రైతులు ఇప్పుడు రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందుతుండటంతో వ్యవసాయం చేస్తున్నారు.
కొత్తగా పోడు రైతులకు కూడా ఈ ఏడాది రైతుబంధు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది వరంగల్ జిల్లాలో 1,42,545 మంది రైతులు పంట సాయం పొందారు. ఇన్నాళ్లు పోడు వ్యవసాయం చేసుకున్న గిరిజనులకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోడు హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నది. జిల్లాలో ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని గ్రామాల్లోని గిరిజనులు హక్కు పత్రాలను అందుకోనున్నారు. వీరికి తోడు మరికొందరు రైతులు కూడా అర్హత పొందడంతో జిల్లాలో రైతుబంధు పొందే వారి సంఖ్య 1,54,405కు పెరిగింది. అలాగే హనుమకొండ జిల్లాలో గత సంవత్సరం వర్షాకాలంలో జిల్లాలో లక్షా 34 వేల 445 మంది రైతులకు రూ.123.193 కోట్లు జమయ్యాయి.
ఇదే యాసంగి పంట సమయానికి మాత్రం లక్షా 36 వేల 325 మందికి రూ. 126. 351 కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు కూడా కొత్త రైతులను కలుపుకుని లక్షా 37 వేల 436 మంది రైతులకు రూ.127 కోట్ల 18లక్షల 43వేల 286 జమకానున్నాయి. తొలుత ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గత ఏడాది కంటే ఈ సారి ఇంకా ముందుగానే ప్రభుత్వం రైతుబంధు డబ్బులు అందిస్తుండడంతో కర్షక కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతున్నది. తొలకరి పలకరించిన వేళ తమ చేతికందనున్న రైతుబంధు సాయంతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు రైతులు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు పంట కాలాన్ని ముందుకు జరుపుకునే చర్యల్లో భాగంగా ఇప్పటికే అనేక మంది వరి నార్లు పోసుకున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పత్తి పంటను వేసుకుని నీళ్లు పారిస్తున్నారు.